న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం టీమిండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.
‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్పవిషయం. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం.
ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సెమీస్‌లో ఆ్రస్టేలియాపై విజయం సాధించిన భారత్ అంతకుముందు లీగ్ దశలో శ్రీలంక, ఆ్రస్టేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్‌పై నెగ్గింది.
అదే విధంగా.. మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి వరుసగా రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత మహిళా కబడ్డీ జట్టును కూడా అభినందించారు.


