- ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఆ అవకాశం ఇప్పటికీ ఉంది
- ట్రంప్‌తో చర్చించాలని సూచిస్తే గతంలో మోదీ అంగీకరించలేదు
- అప్పట్లో భారత్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది
- భారత్‌కు ఇచ్చిన గడువు ముగిశాక ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో ఒప్పందాలు చేసుకున్నాం
- అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టీకరణ
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఎటూ తేలడం లేదు. ఇరుపక్షాలు తరచుగా సమావేశమై చర్చిస్తున్నా అడుగు ముందుకు పడట్లేదు. కొన్ని ముఖ్యమైన అంశాలపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నా భారత్ ఒప్పుకోకపోవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగుస్తున్నాయి. ఒప్పందం వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఇరుదేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోవడం వెనుక గల అసలు కారణాన్ని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ బయటపెట్టారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడకపోవడం వల్లనే ఒప్పందం కుదరడం లేదని తేల్చిచెప్పారు. లుట్నిక్ గురువారం ‘ఆల్–ఇన్ పాడ్‌కాస్ట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ నేరుగా ట్రంప్‌కు ఫోన్ చేసి మాట్లాడితే ఒప్పందం త్వరగా కుదురుతుందని, ఆ అవకాశం ఇప్పటికీ ఉందని స్పష్టంచేశారు. ‘‘ఇండియా గురించి మీకొక సంగతి చెప్పాలి. మేము మొదట యూకేతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. రెండు శుక్రవారాల్లోగా తుది నిర్ణయానికి రావాలని సూచించగా, యూకే అందుకు అంగీకరించింది.
ఎందుకంటే గడువు దాటితే స్టేషన్‌ను వదిలేసి రైలు మరో దేశానికి వెళ్లిపోతుందని చెప్పాం. అనుకున్నట్లుగానే గడువులోగా యూకేతో ఒప్పందం కుదిరింది. బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్.. ట్రంప్‌కు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత డీల్ పట్టాలకెక్కింది. మా అధ్యక్షుడు ట్రంప్ నిచ్చెన మెట్ల తరహాలో ఒక దేశం తర్వాత మరో దేశంతో ఒప్పందానికి వస్తున్నారు. తొలుత వచ్చినవారికే తొలి ప్రాధాన్యత దక్కుతుంది. అందరికంటే ముందు వచ్చినవారితోనే గొప్ప డీల్ కుదురుతుంది. రెండో మెట్టుపై ఉంటే బెస్టు డీల్ ఉండదు. యూకే తర్వాత ఒప్పందం ఎవరితో ఉంటుందని ట్రంప్‌ను చాలామంది అడిగారు. ఆయన కొన్ని పేర్లు చెప్పారు. ఇండియా పేరును రెండుసార్లు బహిరంగంగా ప్రస్తావించారు.
అనంతరం మేము ఇండియా ప్రతినిధులతో మాట్లాడాం. మీకు మూడు శుక్రవారాల దాకా గడువు ఉందని చెప్పాం. గడువులోగా ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత ఇండియాపైనే ఉండగా, వారు స్పందించలేదు. ట్రేడ్ డీల్‌పై చాలాదేశాలతో నేను ప్రత్యక్షంగా చర్చించా. కానీ, ఇది అచ్చంగా ట్రంప్ డీల్. నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే కదా! అందుకే ట్రంప్‌తో నేరుగా మాట్లాడాలని ఇండియా ప్రతినిధులకు సూచించా. మోదీతో మాట్లాడించాలని చెప్పా. ఎందుకో తెలియదుగానీ ఈ విషయంలో భారత్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. ట్రంప్‌తో మోదీ మాట్లాడలేదు. మూడు శుక్రవారాలు ముగిశాక ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలను ప్రకటించాం’’ అని లుట్నిక్ తెలియజేశారు.
భారత్ ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తోంది
‘‘ఇతర దేశాల కంటే ముందే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరుతుందని మేము భావించాం. అలా జరగకపోవడంతో ఇంతకముందు అంగీకరించిన ఒప్పందాన్ని వెనక్కి తీసుకున్నాం. దానిపై ఇప్పుడు ఆలోచించడం లేదు. మరోవైపు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు భారత్ మాకు తెలియజేసింది. మూడు వారాల క్రితమే వెళ్లిపోయిన రైలు కోసం ఎదురు చూస్తారా? అని భారత్‌ను ప్రశ్నించా. కొన్నిసార్లు డోలాయమాన పరిస్థితి ఉండొచ్చు. ఊగుడు బల్లపై భారత్ ఇప్పుడు రాంగ్‌సైడ్‌లో ఉంది.
ఇతర దేశాలు మాతో ఇప్పందాలకు ముందుకొస్తున్నాయి. త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. యూకే తర్వాత ఇండియాతోనే ఒప్పందం చేసుకోవాలని నేను ఆశించా. ఆ దిశగానే చర్చలు నిర్వహించా. త్వరలోనే భారత్ నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం ఉంది. ప్రతి దేశానికీ అంతర్గతంగా ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించాల్సి ఉంటుంది. విదేశాలతో ఒప్పందాలకు పార్లమెంట్ ఆమోదం పొందడం సంక్లిష్టమైన విషయం’’ అని లుట్నిక్ తేల్చిచెప్పారు.
అది నిజం కాదు: భారత్
ట్రంప్‌తో మోదీ మాట్లాడకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం కుదరలేదంటూ అమెరికా మంత్రి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై భారత్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. 2025లో మోదీ, ట్రంప్ ఎనిమిదిసార్లు మాట్లాడుకున్నారని, వేర్వేరు కీలక అంశాలపై చర్చించుకున్నారని గుర్తుచేశారు. ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్‌తో మోదీ మాట్లాడలేదనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. పలు సందర్భాల్లో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చినట్లు రణ«దీర్ జైస్వాల్ తెలిపారు. ట్రేడ్ డీల్ త్వరలో కుదురుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.


