న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన ప్రారంభం
భారత సైనిక వైభవమే ప్రధాన ఆకర్షణ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో 53వ ‘న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది ‘ఇండియన్ మిలిటరీ హిస్టరీ: వేలర్ అండ్ విజ్డమ్ @ 75’ అనే ప్రత్యేక ఇతివృత్తంతో పుస్తక మేళా జరుగుతోంది. నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ వార్షిక వేడుకను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. పుస్తక ప్రదర్శన చరిత్రలోనే తొలిసారిగా అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. దేశ స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్యాగాలను, వారి ధైర్య సాహసాలను ఈ ప్రదర్శన గౌరవిస్తోంది.
సైనిక దళాలకు సగౌరవంగా..
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌లో 500కు పైగా పుస్తకాలు, అర్జున్ ట్యాంక్, ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాల నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. 21 మంది పరమవీర చక్ర విజేతలకు నివాళులర్పించడంతో పాటు, 1947 బద్గాం యుద్ధం నుండి ‘ఆపరేషన్ సిందూర్’ వరకు కీలక సైనిక చర్యలపై చర్చలు నిర్వహిస్తారు. ‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుక, సర్దార్ పటేల్ జీవిత విశేషాలపై ప్రదర్శనలు ఉంటాయి.
జ్ఞానం కంటే పవిత్రమైనదేదీ లేదు
పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదని భగవద్గీత చెబుతోంది. ఈ పుస్తక ప్రదర్శన కేవలం సేకరణ మాత్రమే కాదు, ఇది ఆలోచనల సమ్మేళనం. ప్రపంచ ప్రచురణ రంగంలో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది, ఇది మన సాంస్కృతిక బలానికి నిదర్శనం’.. అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెయిన్ సాంస్కృతిక మంత్రి ఎర్నెస్ట్ ఉర్తాసున్ డొమెనెచ్, ఖతార్ రాయబారి మహమ్మద్ హసన్ జాబిర్ అల్–జాబిర్, ఖతార్ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ అబ్దుల్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
35కు పైగా దేశాలు.. వెయ్యికి పైగా ప్రచురణకర్తలు
పుస్తక ప్రదర్శన జనవరి 10 నుండి 18 వరకు తొమ్మిది రోజుల పాటు జరగనుంది. 35కు పైగా దేశాల నుండి 1000 మందికి పైగా ప్రచురణకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 3000కు పైగా స్టాళ్లు, 600కు పైగా సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఖతార్ ‘గౌరవ అతిథి’ దేశంగా ఉండగా, స్పెయిన్ ‘ఫోకస్ కంట్రీ’గా వ్యవహరించనుంది. పుస్తకాలతో పాటు సాయంత్రం వేళల్లో రాజస్థానీ మంగనియార్ కళాకారుల ప్రదర్శనలు, ఆర్మీ బ్యాండ్ సంగీతం అలరించనున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా కథలు చెప్పడం, వేద గణితం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు 20 లక్షల మంది సందర్శకులు హాజరౌతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పీయూష్ మిశ్రా, స్మృతి ఇరానీ, హేమమాలిని, కైలాష్ సత్యార్థి, రికీ కేజ్ వంటి ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు.


