ప్రశాంత జీవనం వాళ్లకు సహజ సిద్ధం. ప్రకృతి సంపద వాళ్లకు వారసత్వ ఫలం. ఖనిజ సంపద వాళ్ల జన్మహక్కు..! ఐనా శతాబ్దాలుగా వెంటాడుతున్న వెనుకబాటు తనం... పేదరికం... మావోయిస్ట్ ఉద్యమానికి కేంద్ర స్థావరంగా మారిన తరువాత వాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నలిగి సమిధలుగా మారిన దుస్థితి..! అయినా తమదైన జీవన విధానాన్ని, సంస్కృతిని ఆస్వాదించడం దండకారణ్యం ఆదివాసీల ప్రత్యేకం. తుపాకీ తుటాల మోతతో.. ఖాకీ బూట్ల సవ్వడులతో అడవిలో అలజడి చెలరేగి.. వారి బతుకులు అగమ్యగోచరంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో నక్సలిజం తగ్గిపోవడం.. మావోయిస్టు బడా నాయకులు నేలకొరగడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దండకారణ్యంలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటున్నాయా? గిరిజనులు అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నారా?
దండకారణ్యం ప్రకృతి ఇచ్చిన ఓ సంపద. కొండలు, లోయలు, సెలయేళ్లు ఎటు చూసినా పచ్చదనం మైదానాలు.. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు.. ఇవన్నీ ఆదివాసీ తెగలకు పుటిల్లు. గోండులు, మారియా, బగత, కోయ, గొత్తికోయ, ముఖ, హల్బా లాంటి తెగలతో పాటు అతి పురాతన ఆదివాసీ తెగ మురియాలకు దండకారణ్యంలోని అబుజ్‌మఢ్ జన్మస్థానం..! గడిచిన రెండుమూడు దశాబ్దాలుగా ఈ తెగలన్నీ అటు మావోయిస్టులు.. ఇటు పోలీసుల మధ్య నలిగిపోయి.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.
సల్వాజులుం కనుమరుగు
దండకారణ్యంలో ఇన్ని తెగలున్నా.. అడవుల్లో జీవించే గొత్తికోయలు మావోయిస్టులకు.. మైదాన ప్రాంతాల్లో ఉండే కోయలు పోలీసులకు మద్దతిస్తారనే అపవాదులు ఉండేవి. దీంతో.. కేంద్ర ప్రభుత్వం 2005 నుంచే గొత్తికోయల్లో మార్పు తేవాలని ప్రయత్నాలను మొదలు పెట్టింది. అప్పట్లోనే ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ మొదలైంది. పోలీసు యాక్షన్ కంటే.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని అప్పట్లో ప్రభుత్వాలను ఆచరణలో పెట్టాయి. దాంతో.. సల్వాజులుం పేరుతో శాంతి సేన ఏర్పాటైంది. ఈ చర్య అప్పట్లో కోయల మధ్య విభేదాలను సృష్టించిందనే వాదనలున్నాయి. మైదానాల్లో ఉండే కోయలు అడవుల్లో ఉండే గొత్తికోయలను టార్గెట్‌గా చేసుకున్నారనే అపవాదులున్నాయి. అయినా.. ఎప్పుడు.. ఏ క్షణంలో.. ఎక్కడి నుంచి తుపాకీ మోత మోగుతుందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితులుండేవి. ఆహ్లాదకర వాతావరణంలో తమ పండుగలను జరుపుకునే పరిస్థితులు ఉండేవి కాదు. వస్తుమార్పిడి విధానంలో సరుకులు కొనుగోలు చేసే సంతల్లోనూ తుపాకీమోత మోగుతుందేమోననే భయం ఉండేది. బుల్లెట్ల కారణంగా ఆదివాసీల ఉనికి ప్రమాదంలో పడుతోందని అప్పట్లో హక్కుల సంఘాలు ఆరోపించేవి. పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఆదివాసీలు సమిధలుగా మారుతున్నారనే ఆందోళనలు కొనసాగేవి. మహేంద్ర కర్మ హత్యతో సల్వాజులుం క్రమంగా కనుమరుగైంది. తర్వాత క్రమంగా మావోయిస్టులు మళ్లీ దండకారణ్యంపై పట్టుసాధించారు.
ఆపరేషన్ కగార్‌తో ఉక్కుపాదం
కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరాక.. మావోయిస్టు ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర బలగాలను మోహరించింది. బస్తర్ పరిధిలోని అన్ని జిల్లాల్లో ఐదారు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపులు ఏర్పాటయ్యాయి. ఫలితంగా ఆదివాసీల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు తరచూ ఆదివాసీలను టార్గెట్‌గా చేసుకునేవారు. ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, పూజారి కాంకేర్ వంటి ప్రాంతాల్లో ప్రజాకోర్టులను నిర్వహించి, స్థానిక సర్పంచ్‌లను హతమార్చేవారు. ఆదివాసీల కిడ్నాప్‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో.. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ పేరుతో.. డీఆర్జీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లొంగిపోయిన మావోయిస్టులను రిక్రూట్ చేసుకుని, కూంబింగ్ నిర్వహించడం మొదలు పెట్టింది. సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలకు దీటుగా డీఆర్జీ తయారైంది. అబూజ్‌మఢ్ ఎన్‌కౌంటర్ అయినా.. బీజాపూర్ అయినా.. మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలిన ప్రతీచోట.. డీఆర్జీ ఆధిపత్యం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లే.. 2026 మార్చి చివరికల్లా.. మావోయిజాన్ని ఖతం చేయడంలో దాదాపుగా సఫలమైంది. మావోయిస్టు పెద్దదిక్కుగా ఉన్న తిప్పిరి తిరుపతి కూడా లొంగిపోవడంతో.. ఇప్పుడప్పుడే ఉద్యమం తిరిగి కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
ఆదివాసీల జీవితాల్లో వెలుగురేఖలు!
దండకారణ్యంలో ఇప్పుడు అన్నల అలజడి లేదు..! తుపాకీ మోతలు లేవు..! మరి ఇప్పుడు ఆదివాసీల జీవితాల్లో మార్పు మొదలైందా? ఈ ప్రశ్నకు దాదాపుగా ఔననే సమాధానం వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు కరెంట్ అనేది ఎరగని గ్రామాల్లోనూ ఇప్పుడు విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. ఈ కోవలో ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, గుండం, తిమ్మిరాల, కోమటిపల్లి, భీమారంపాడు, చిన్న ఉట్లపల్లి, పూజారి కాంకేర్ వంటి గ్రామాలు ఈ ఘనతకు వేదికయ్యాయి. అంతేకాదు.. ప్రయాణం అంటే కేవలం కిలోమీటర్ల కొద్దీ కాలినడకే మార్గంగా ఉండేది. అత్యవసర సమయాల్లో ఎవరినైనా ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే.. వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటేలోగా ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సందర్భాలుండేవి. చిన్నపిల్లలకు చదువు ఆమడ దూరంలో ఉండేవి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మార్పు మొదలైంది. రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కరెంటుతోపాటు.. కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇక్కడి ప్రజలు వాడుతున్నారు. గడిచిన 75 ఏళ్లుగా బస్సు ముఖం ఎరగని గూడేలకు ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి. మావోయిస్టులు జనతన సర్కారు పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజాపాలన మొదలైంది. పిల్లలు బడికి వెళ్తున్నారు. పోషకాహారం వారికి అందుతోంది. ఈ ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణను ప్రారంభించాయి.


