42 దేశాల ప్రతినిధులతో కామన్వెల్త్ సదస్సు
నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హాజరుకానున్న 61 మంది స్పీకర్లు
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు సర్వం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమైన 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తాబైంది. జనవరి 15న ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్‌లో ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తర్వాత సభికులనుద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు భారీ స్పందన లభించింది. కామన్వెల్త్ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో సమకాలీన పార్లమెంటరీ సవాళ్లు, పరిష్కారాలపై విస్తృతంగా మేధోమథనం జరగనుంది.
ప్రధానంగా ప్రజాస్వామ్య సంస్థలను పటిష్టం చేయడంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల కీలక పాత్రపై చర్చించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ పనితీరులో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అంశాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా పార్లమెంటరీ ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన వినూత్న వ్యూహాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.
సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు..
1. ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత ఎంత?
2. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?
3. పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?
4. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా?


