స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలి
ఇంట్లో పిల్లలతో మాతృభాషలో మాట్లాడాలి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు
జోద్‌పూర్/జైపూర్: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు స్వదేశీ, స్వభాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని, ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడుకోవాలని సూచించారు. మనదేశంలోనే తయారైన ఉత్పత్తులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సమాజాన్ని, సంస్కృతిని, మతాన్ని కాపాడుకోవాలంటే భాష అత్యంత కీలకమని ఉద్ఘాటించారు.
ఆధునిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి, జీవితంలో ప్రగతి సాధించడానికి ఇతర భాషలు నేర్చుకోవడం, మాట్లాడడం అవసరమని తెలిపారు. ఇంట్లో మాత్రం పిల్లలతో మాతృభాషలో సంభాషించాలని చెప్పారు. దానివల్ల వారికి తమ మూలాలతో అనుబంధం మరింత బలపడుతుందన్నారు. స్వదేశీ, స్వభాష మనందరి నినాదం కావాలని స్పష్టంచేశారు. రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో శనివారం మహేశ్వరి అంతర్జాతీయ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు.
దేశ విదేశాల్లో స్థిరపడిన మహేశ్వరి వర్గం ప్రజలు హాజరయ్యారు. పిల్లలతో మాతృభాషలో మాట్లాడితే వారు స్వస్థలంతో, సొంత చరిత్రతో అనుసంధానమవుతారని అమిత్ షా వివరించారు. సమాజాన్ని, మతాన్ని సజీవంగా ఉంచేది, సంస్కృతిని ముందుకు నడిపించేది భాషేనని స్పష్టంచేశారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ మన ధ్యేయమని పునరుద్ఘాటించారు.
ఆ దిశగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనకు అవసరమైన ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా మనదేశంలో ఉత్పత్తి కానివాటిని తయారు చేయడానికి ముందుకు రావాలని కంపెనీలకు సూచించారు. దేశ అభివృద్ధిలో మహేశ్వరి వర్గం ప్రజల కృషిని అమిత్ షా ప్రశంసించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు.
రాజస్తాన్‌లో పేపర్ లీక్‌లు బంద్
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నేతృత్వంలో రాజస్తాన్ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శనివారం జైపూర్‌లోని రాజస్తాన్ పోలీసు అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధిస్తుందని అన్నారు. భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని చెప్పారు. క్రైమ్ రేటు చాలావరకు తగ్గిపోయిందని, పేపర్ లీక్‌లు ఆగిపోయానని తెలిపారు. లంచాలు, సిఫార్సుల బెడద లేకుండా యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు.


