స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)ను ఆస్ట్రేలియా విజయంతో మొదలుపెట్టింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4- 8 వరకు రెండో టెస్టుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరు వచ్చేస్తున్నారా!
బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో ఈ డే- నైట్ మ్యాచ్ జరుగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు (Pink Ball Test)కు ముందు ఆస్ట్రేలియాకు అదిరిపోయే శుభవార్తలు అందాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా తొడ కండరాల గాయంతో హాజిల్‌వుడ్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
మరోవైపు.. ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్ సమస్యల వల్ల చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, హాజిల్‌వుడ్ సిడ్నీలోని క్రికెట్ సెంట్రల్‌లో బాల్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. కమిన్స్ కూడా పింక్ బాల్‌తో నెట్స్‌లో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ..

పూర్తి స్థాయిలో కోలుకుంటేనే
‘‘యాషెస్ సిరీస్‌లో ఏదో ఒక దశలో హాజిల్‌వుడ్ అందుబాటులోకి వస్తాడని మాకు తెలుసు. అయితే, ఇంకాస్త ముందుగానే అతడు జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇక కమిన్స్ రిహాబిలిటేషన్ దాదాపుగా పూర్తై పోయింది.
తన బౌలింగ్‌లో వేగం కనిపిస్తోంది. అతడు సానుకూలంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, కమిన్స్‌ను మ్యాచ్ ఆడే విషయంలో తొందరపెట్టలేము. అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటేనే రంగంలోకి దిగుతాడు’’ అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు.
కాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టులకు జరుగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలో స్టీవెన్ స్మిత్ ఆసీస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!


