
కెప్టెన్‌కు అక్షర్ పటేల్ మద్దతు
పెర్త్: స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సమక్షంలో శుబ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్‌గా రాటుదేలుతాడని భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అభిప్రాయ పడ్డాడు. ఇద్దరు సీనియర్ బ్యాటర్లు తమ అనుభవంతో గిల్‌కు సరైన మార్గనిర్దేశనం చేయగలరని అతను అన్నాడు. ‘గిల్‌కు కెప్టెన్‌గా ఇది సరైన సమయం. కెప్టెన్లుగా పని చేసిన రోహిత్, కోహ్లి జట్టుతో ఉన్నారు. వారు అతనికి తమ వైపునుంచి సహాయపడగలరు. ఇది గిల్ నాయకుడిగా ఎదగడంలో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు తాను కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లలో ఎప్పుడూ ఒత్తిడికి లోను కాకపోవడం గిల్‌కు సంబంధించి అతి పెద్ద సానుకూలత’ అని అక్షర్ వ్యాఖ్యానించాడు.
కోహ్లి, రోహిత్‌ల ఆట గురించి తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అక్షర్ గుర్తు చేశాడు. ‘కోహ్లి, రోహిత్ అత్యున్నత స్థాయి క్రికెటర్లు. వారి ఫామ్‌లో ఎలా ఉందో తొలి వన్డేలో తెలుస్తుంది. ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా తాము ఏం చేయాలో వారిద్దరికి బాగా తెలుసు. సీఓఈలో ప్రాక్టీస్ చేసి ఈ సిరీస్‌కు సిద్ధమయ్యారు. నెట్స్‌లో, ఫిట్‌నెస్‌పరంగా కూడా చాలా చురుగ్గా కనిపిస్తున్నారు’ అని అక్షర్ వెల్లడించాడు. ఆ్రస్టేలియాలో ఎలాంటి పిచ్‌లు ఎదురైనా తమకు ఇబ్బంది లేదని, తాము పిచ్‌ల గురించి మాట్లాడటం మానేసి వ్యూహాలపైనే చర్చిస్తున్నామని అతను స్పష్టం చేశాడు.
‘ఒకప్పుడు మన జట్టు ఆ్రస్టేలియాకు వస్తే పిచ్‌లు, పరిస్థితులు, బౌన్స్‌ల గురించి చర్చ జరిగేది. మేం చాలా తక్కువగా కూడా అక్కడ ఆడేవాళ్లం. కానీ 2015 వరల్డ్ కప్ తర్వాత పరిస్థితి మారింది. మేం ఇక్కడ ఎక్కువగా ఆడటం మొదలు పెట్టడంతో బ్యాటింగ్ కూడా మెరుగైంది. ఇప్పుడైతే ఆ్రస్టేలియాలో ఆడుతున్నట్లు అనిపించడం లేదు. ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరమూ లేదు. పిచ్ గురించి కాకుండా పరుగులు ఎలా చేయాలి తదితర ప్రణాళికల గురించే మాట్లాడుకుంటున్నాం’ అని అక్షర్ వివరించాడు. ఆసియా కప్‌లో తాను బాగా ఆడానని, ఆ్రస్టేలియా గడ్డపై సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు అతను పేర్కొన్నాడు.