
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ఆడబోయే భారత టీ20 జట్టుకు అతడు ఎంపికయ్యాడు. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు గిల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
ఏడాది కాలంగా దూరం
కాగా 2024 జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గిల్ చివరగా టీ20లలో టీమిండియాకు ఆడాడు. నాడు సూర్య కెప్టెన్సీలో ఓపెనర్‌గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 39 పరుగులు చేశాడు.
అనంతరం.. దాదాపు ఏడాది కాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్.. మెగా టోర్నీ నేపథ్యంలో అకస్మాత్తుగా జట్టులోకి రావడమే కాకుండా.. వైస్ కెప్టెన్‌గానూ ఎంపిక కావడం గమనార్హం.
అక్షర్ పటేల్‌ను తప్పించి..
ఇన్నాళ్లు టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి.. గిల్‌ను సూర్య డిప్యూటీగా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ విషయంపై స్పందించాడు.
అందుకే వైస్ కెప్టెన్‌గా గిల్
‘‘టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన తర్వాత టీమిండియా శ్రీలంకలో టీ20 సిరీస్ ఆడినపుడు నేను కెప్టెన్‌గా ఉంటే.. గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 కోసం కొత్త సైకిల్‌ను మేము అప్పుడే ఆరంభించాము.
అయితే, ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో గిల్ బిజీ అయ్యాడు. అందుకే టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీతోనూ మరింత బిజీ అయిపోయాడు.
అందుకే టీ20లకు కాస్త దూరమయ్యాడు. అతడు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’ అని సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ తర్వాత సూర్య టీమిండియా టీ20 పగ్గాలు చేపట్టగా.. టెస్టులకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇటీవలే గిల్ టెస్టు జట్టు సారథి అయ్యాడు.
ఇక ఇప్పటికే వన్డేల్లోనూ వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వడంతో అతడిని ఆల్ ఫార్మాట్ ఫ్యూచర్ కెప్టెన్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ సంకేతాలు ఇచ్చినట్లయింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ -2025 టోర్నీ జరుగనుంది.
ఐపీఎల్‌లో అదరగొట్టాడు
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సందర్భంగా శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. బ్యాటర్‌గా 754 పరుగులతో ఇరగదీసిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించాడు. అంతేకాదు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి సత్తా చాటాడు.
అయితే, అంతర్జాతీయ టీ20లలో గిల్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడి 139.28 స్ట్రైక్‌రేటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ (126) ఉంది. ఇక ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్.. 15 మ్యాచ్‌లలో కలిపి 650 పరుగులు సాధించాడు. గుజరాత్‌ను ప్లే ఆఫ్స్ చేర్చినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు.
చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
#ShubmanGill is back in T20Is! 😳
Here's what skipper #SuryakumarYadav has to say about his inclusion as a vice-captain! 🗣
Watch the Press Conference Now 👉 https://t.co/kwwh4UUSWe pic.twitter.com/OiX06F3995— Star Sports (@StarSportsIndia) August 19, 2025