బెంగళూరు: అండర్–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
కెప్టెన్ విఫలం
భారత బ్యాటర్లలో కనిష్క్ చౌహాన్ (28 నాటౌట్), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ విహాన్ మల్హోత్రా (10), వన్ష్ ఆచార్య (2), వఫీ (2), వినీత్ (0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్ అజీజ్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఈ టోర్నమెంట్‌లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్‌తో పాటు భారత్ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్ 4 మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది.


