నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కోహ్లి | I'm 37, Need To Look After My: Kohli Explains Secret Behind Ranchi Masterclass | Sakshi
Sakshi News home page

నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి

Dec 1 2025 12:25 PM | Updated on Dec 1 2025 12:59 PM

I'm 37, Need To Look After My: Kohli Explains Secret Behind Ranchi Masterclass

విరాట్‌ కోహ్లి (PC: BCCI)

సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి పాత ‘కింగ్‌’ను గుర్తుచేశాడు. రాంచి వేదికగా ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి శతక్కొట్టాడు. వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసి.. సింగిల్‌ ఫార్మాట్లో అత్యధికసార్లు వంద పరుగుల మార్కు అందుకున్న ఏకైక బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.

తన ‘విన్‌’టేజ్‌ ఆటతోనే విమర్శకులకు సమాధానం ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. టీమిండియా యాజమాన్యానికి కూడా తన ఫామ్‌ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో సఫారీలపై విజయానంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

 నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు
‘‘నేను వందకు 120 శాతం ఫామ్‌తో తిరిగి వస్తానని ఇప్పటికే చెప్పాను. ఈ మ్యాచ్‌ కోసం నేను పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను. ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుని ప్రాక్టీస్‌ చేశాను. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు.

నా శరీరానికి కూడా తగినంత విశ్రాంతి, రికవరీ కోసం సమయం కావాలి. ఆట ఎలా ఉండబోతుందో ముందుగానే నా మైండ్‌లోనే ఓ స్పష్టతకు వచ్చేస్తాను. ఈరోజు మ్యాచ్‌లో ఇలా ఆడటం అద్భుతంగా అనిపించింది. తొలి 20- 25 ఓవర్ల వరకు పిచ్‌ బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్‌ కాస్త నెమ్మదించింది.

వెళ్లి బంతిని బాదడమే కదా అనుకున్నా. కానీ తర్వాత పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేశాను. ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆటను పూర్తిగా ఆస్వాదించాను. చాలా ఏళ్లుగా నేను ఇదే పని చేస్తున్నాను. గత 15-16 ఏళ్లలో 300కు పైగా వన్డేలు ఆడాను.

టచ్‌లో ఉన్నట్లే లెక్క
ప్రాక్టీస్‌లో మనం బంతిని హిట్‌ చేయగలిగామంటే టచ్‌లో ఉన్నట్లే లెక్క. సుదీర్ఘకాలం పాటు క్రీజులో నిలబడి బ్యాటింగ్‌ చేయాలంటే శారీరకంగా ఫిట్‌గా ఉండటం ముఖ్యం. ఆటకు మానసికంగా సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం.

కేవలం గంటల కొద్ది సాధన చేస్తేనే రాణించగలము అనే మాటను నేను పెద్దగా నమ్మను. ముందుగా చెప్పినట్లు మానసికంగా సిద్ధంగా ఉంటే ఏదైనా సాధ్యమే. నేను ప్రతిరోజూ కఠినశ్రమ చేస్తాను. క్రికెట్ ఆడుతున్నాను కాబట్టే వర్కౌట్‌ చేయను. జీవితంలో ఇదీ ఒక భాగం కాబట్టే చేస్తాను.

అప్పటి వరకు ఆడుతూనే ఉంటా
నాకు నచ్చినట్లుగా జీవిస్తాను. శారీరకంగా ఫిట్‌గా ఉండి.. మానసికంగా ఆటను ఆస్వాదించినన్ని రోజులు క్రికెట్‌ ఆడుతూనే ఉంటాను’’ అని కోహ్లి కుండబద్దలు కొట్టాడు. ఇప్పట్లో తాను రిటైర్‌ అయ్యే ప్రసక్తే లేదని సంకేతాలు ఇచ్చాడు.

కాగా రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి నుంచి వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడతామనే హామీ రాలేదని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గతంలో పేర్కొన్నాడు. అయితే, రో-కో వన్డేల్లో వరుసగా సత్తా చాటుతూ తాము ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని చాటి చెబుతున్నారు.

తాజాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు చేయగా.. ఓపెనింగ్‌ బ్యాటర్‌ రోహిత్‌ 51 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 136 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా సఫారీలను 17 పరుగులతో ఓడించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

చదవండి: ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement