సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 30) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (352) పాకిస్తాన్ మాజీ షాహిద్ అఫ్రిది (351) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు విభాగంలో రోహిత్, అఫ్రిది తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకిన ఏకైక ఆటగాడు విండీస్ వీరుడు క్రిస్ గేల్ (331) మాత్రమే.
తాజా ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ సిక్సర్ల సంఖ్య 645కి చేరింది. ఈ విభాగంలో ఇప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న అతను.. రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్ కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు.
రోహిత్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ (553) కొనసాగుతున్నాడు. ఆతర్వాతి స్థానాల్లో అఫ్రిది (476), బ్రెండన్ మెల్‌కల్లమ్ (398), జోస్ బట్లర్ (387) టాప్-5లో ఉన్నారు.
ఇక్కడ గమనించదగ్గ ఓ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో రోహిత్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఈ విభాగంలో ఐదో స్థానంలో ఉన్న జోస్ బట్లర్ హిట్‌మ్యాన్‌కు ఆమడదూరంలో ఉన్నాడు. రోహిత్‌కు బట్లర్‌కు మధ్య ఉన్న సిక్సర్ల వ్యత్యాసం ఏకంగా 258. కెరీర్ చరమాంకంలో ఉన్న బట్లర్ మహా అయితే ఇంకో 100 సిక్సర్లు కొట్టగలడు.
ఈ లెక్కన అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ పేరిట చిరకాలం ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈతరం క్రికెటర్లలో ఎవరికీ మూడు ఫార్మాట్లలో కొనసాగేంత సీన్ లేదు. ఒకటి, రెండు ఫార్మాట్లతో హిట్‌మ్యాన్ రికార్డును బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి రోహిత్ శర్మ సిక్సర్ల శర్మగా క్రికెట్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాడు.


