అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను సెలక్ట్‌ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్‌ | Agarkar Breaks Silence On Shreyas Iyer Exclusion From Asia Cup 2025 Squad | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్‌ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్‌

Aug 19 2025 3:35 PM | Updated on Aug 19 2025 4:59 PM

Agarkar Breaks Silence On Shreyas Iyer Exclusion From Asia Cup 2025 Squad

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్షపాత ధోరణి వీడాలంటూ సోషల్‌ మీడియా వేదికగా సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌-2025 (Asia Cup)కి బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ను టీ20 జట్టు సారథిగా కొనసాగించిన యాజమాన్యం.. వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ను తప్పించింది. టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్‌ గిల్‌ను అతడి స్థానంలో సూర్యకు డిప్యూటీగా నియమించింది.

శ్రేయస్‌ అయ్యర్‌కు మొండిచేయి
చాన్నాళ్లుగా టీ20లలో టీమిండియాకు దూరంగా ఉన్న గిల్‌కు ప్రమోషన్‌ ఇచ్చిన బీసీసీఐ.. మిడిలార్డర్‌ స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)కు మాత్రం మరోసారి మొండిచేయి చూపింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఆసియా కప్‌ జట్టులో ఈ ముంబై బ్యాటర్‌కు చోటు దక్కలేదు.

పడిలేచిన కెరటంలా.. 
కనీసం స్టాండ్‌ బై ప్లేయర్ల జాబితాలోనూ అయ్యర్‌కు స్థానం కల్పించలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ అభిమానులు బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ ముంబై బ్యాటర్‌ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంగా బీసీసీఐ గతంలో అతడిని సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తప్పించింది.

అయితే, మళ్లీ దేశవాళీ క్రికెట్‌ ద్వారా తనను తాను నిరూపించుకున్న శ్రేయస్‌.. 2024లో ముంబై రంజీ ట్రోఫీ టైటిల్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టైటిల్‌ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

అంతేకాదు.. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించి.. ట్రోఫీ అందించాడు. ఇరానీ కప్‌-2024 గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో మళ్లీ బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న శ్రేయస్‌.. సెంట్రల్‌ కాంట్రాక్టు తిరిగి దక్కించుకోవడంతో పాటు.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.

చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర
అనంతరం.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో 243 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి.. భారత్‌ టైటిల్‌ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు కొని కెప్టెన్‌ను చేసింది.

ఐపీఎల్‌లోనూ సత్తా చాటి
ఈ క్రమంలో బ్యాటర్‌గా, సారథిగా శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. ఈ ఏడాది క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఏకంగా 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. పంజాబ్‌ను ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఈ మేర సత్తా చాటాడు. కానీ బీసీసీఐ మాత్రం ఆసియా కప్‌ ఆడే జట్టులో అతడికి చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

కుండబద్దలు కొట్టిన అగార్కర్‌
ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌. జట్టుకు ఎంపిక కాకపోవడంలో అతడి తప్పేం లేదు. అలాగే మా తప్పు కూడా ఏమీ లేదు.

అతడు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. అయినా.. ఎవరి స్థానంలో అతడిని తీసుకురావాలో మీరే చెప్పండి?’’ అని అగార్కర్‌ మీడియా సమావేశంలో ఎదురు ప్రశ్నించాడు. జట్టులో పదిహేను మందికి మాత్రమే స్థానం ఉందని.. కాబట్టి శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోలేకపోయామని స్పష్టం చేశాడు.

ఆసియా కప్‌ టీ20-2025 టోర్నీకి భారత జట్టు 
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్‌.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, యశస్వి జైస్వాల్‌.

చదవండి: ‘శుబ్‌మన్‌ గిల్‌ కాదు!.. రోహిత్‌ తర్వాత వన్డే కెప్టెన్‌గా అతడే ఉండాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement