ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడిన భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) సంబంధించి బిగ్ అప్‌డేట్ అందుతుంది. టీమిండియాలోకి శ్రేయస్ రీఎంట్రీ ఇప్పట్లో కష్టమేనని సమాచారం. ఇండియాటుడే నివేదిక ప్రకారం.. శ్రేయస్‌కు తాజాగా అల్రాసోనోగ్రఫీ (USG) స్కాన్ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది.
ప్రస్తుతం అతను సాధారణ పనులు, తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు మాత్రమే చేసుకోవచ్చు. హార్డ్ ట్రైనింగ్ మరో నెల పాటు నిషేధం. రెండు నెలల తర్వాత మరో స్కాన్ ఆధారంగా BCCI CoEలో అతడి రీహాబ్ ప్లాన్ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే శ్రేయస్ మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు.
ఈ మధ్యలో అతను సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు దూరమవుతాడు. మార్చిలో జరిగే ఐపీఎల్ 2026లోనే శ్రేయస్ పునఃదర్శనం ఉంటుంది. ఈ వార్త తెలిసి శ్రేయస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. తొలుత శ్రేయస్ వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ సమయానికంతా సిద్దంగా ఉంటాడని అంతా అనుకున్నారు.
తాజా అప్‌డేట్‌ని బట్టి చూస్తే ఇప్పట్లో శ్రేయస్‌ను టీమిండియా జెర్సీలో చూడటం కష్టమేనని స్పష్టమవుతుంది.
కాగా, అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.
అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.
అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు. ప్రస్తుతం అతను మునుపటిలా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. క్రికెట్‌కు మాత్రం ఇంకొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.


