రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు.
లిస్ట్-ఏ ఫార్మాట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్.. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్ నుంచే విరాట్ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.
28000 అంతర్జాతీయ పరుగులు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.
15000 వన్డే పరుగులు
308 ఇన్నింగ్స్‌ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో విరాట్ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు
విరాట్ మరో 42 పరుగులు చేస్తే సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.
అత్యధిక వన్డే పరుగులు
న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్‌ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్ న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో 9000 పరుగులు
ఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్ కూడా ఆడనున్న విరాట్.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్‌లు) ఉన్నాయి.


