సాధారణంగా ఏ దేశ క్రికెట్‌లో అయినా దేశవాలీ ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లకు జాతీయ జట్టు అవకాశాలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దేశవాలీ టోర్నీల్లో శతక్కొట్టుడు కొట్టి, పరుగుల వరద పారించినా జాతీయ జట్టు అవకాశాలు రావు. బ్యాటింగ్ ఆధిపత్యం నడుస్తున్న జమానాలో చచ్చీ చెడి వికెట్లు తీసినా పట్టించుకునే నాథుడే లేడు.
తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీలో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ 5 మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. అయినా అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు.
మరో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. లిస్ట్-ఏ ఫార్మాట్‌లో ఇతగాడు ఇరగదీస్తాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ చేశాడు. అయినా ఇతనికి కూడా టీమిండియాలో చోటు దక్కలేదు.
రుతురాజ్ విషయంలో మరింత విడ్డూరమైన విషయం ఏంటంటే.. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో అద్భుతమైన సెంచరీ చేసినా మొండిచెయ్యే ఎదురైంది.
అద్భుత ప్రదర్శనలు చేస్తున్న మరో ఆటగాడు ధృవ్ జురెల్. ఇతగాడు కూడా విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మరో యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా ఇదే. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో సుడిగాలి శతకం బాదాడు.
వీహెచ్‌టీలో సత్తా చాటుతున్న దేశీయ టాలెంట్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అనామక బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నారు. కాస్తోకూస్తో అనుభవం ఉండి, గుర్తింపు ఉన్న ఆటగాళ్లకే అవకాశాలు లేనప్పుడు వీరు టీమిండియా బెర్త్‌లు ఆశించడం అత్యాశే అవుతుంది.
బౌలింగ్ విషయానికొస్తే.. బ్యాటర్లు రాజ్యమేలే జమానాలో చచ్చీ చెడీ వికెట్లు తీస్తున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సెలెక్టర్లు మరోసారి మొండిచెయ్యి చూపారు. షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా, సెలెక్టర్లు అతన్ని కరుణించడం లేదు. షమీ విషయంలో ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందన్నది జగమెరిగిన సత్యం.
దేశవాలీ టోర్నీల్లో అద్భుతమంగా రాణిస్తూ టీమిండియా బెర్త్‌లు దక్కించుకోలేకపోతున్న షమీ లాంటి బౌలర్లు చాలామంది ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ, మహారాష్ట్ర పేసర్ రామకృష్ణ ఘోష్, ఆంధ్రప్రదేశ్ మీడియం పేసర్ సత్యనారాయణ రాజు లాంటి వారు ప్రస్తుతం జరుగుతున్న వీహెచ్‌టీలో చెలరేగి బౌలింగ్ చేస్తున్నా, టీమిండియా బెర్త్ దక్కలేదు.
ఇక్కడ ఓ ప్రశ్న ఉత్పన్నమవ్వవచ్చు. ఉన్నది 11 బెర్త్‌లు, ఎంతమందికి అవకాశాలు ఇస్తారని చాలామంది అడగవచ్చు. ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం ఉండదు. అయితే ఇలా జరుగుతూపోతే మాత్రం దేశీయ క్రికెట్‌లో సత్తా చాటాలన్న తపన ఆటగాళ్లలో చచ్చిపోయే ప్రమాదం ఉంది.
ఏదైనా ప్రత్యామ్నాయం చూపకపోతే దేశీయ క్రికెట్‌కు విలువే లేదు. ఇప్పటికే దేశీయ క్రికెట్ నామమాత్రంగా మారిందని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎవరి దృష్టిలోనో పడి, ఐపీఎల్ అవకాశాలు వస్తే.. వచ్చి అక్కడ కూడా రాణిస్తేనే టీమిండియా అవకాశాలు వస్తాయన్నది జగమెరిగిన సత్యం.
ఇలా ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా బెర్త్ దక్కించుకోవడమన్నది అందరికీ సాధ్యపడదు. ఏదో హర్షిత్ రాణా లాంటి వారిని మాత్రమే ఇలాంటి అదృష్టాలు వరిస్తాయి. హర్షిత్ రాణా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని చర్చించక తప్పదు.
ప్రస్తుతం వీహెచ్‌టీలో రాణిస్తున్న పేస్ బౌలర్లు హర్షిత్‌కు ఏ విషయంలో తీసిపోతారు. వారికంటే హర్షిత్‌కు ఉన్న అదనపు అర్హతలు ఏంటి..? దీనికి సమాధానం భారత సెలెక్టర్ల వద్ద కానీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వద్ద కానీ ఉండదు. మొత్తంగా దేశీయ క్రికెట్‌కు విలువే లేకుండా పోయిందన్నది సగటు భారత క్రికెట్ అభిమాని అభిప్రాయం.


