సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఆదివారం(నవంబర్ 23) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న గువహటిలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెలక్టర్ ఆర్పీ సింగ్, సెక్రటరీ దేవజిత్ సైకియా సమావేశమై స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు.
అయితే ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నట్లు సమాచారం. మెడనొప్పి గాయం కారణంగా సఫారీలతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకొన్న గిల్.. పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు వస్తున్నాయి.
అతడు తిరిగి టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. హార్దిక్ తొడ కండరాల గాయం కారణంగా ఆసియా కప్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంకా అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.
అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు సౌతాఫ్రికాతో సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో వన్డేలకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా సౌతాఫ్రికాతో వన్డేలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.
కెప్టెన్‌గా రిషబ్ పంత్..?
కాగా శుభ్‌మన్ గిల్ గైర్హజరీలో భారత వన్డే జట్టు పగ్గాలను స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వన్డేల్లో గిల్‌కు డిప్యూటీగా అయ్యర్ ఉన్నాడు. కానీ అయ్యర్ కూడా ఇప్పుడు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారు. పంత్ ప్రస్తుతం గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
ఇప్పటివరకు టెస్టు, టీ20ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన పంత్.. తొలిసారి వన్డే జట్టు బాధ్యతలను తీసుకునేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు వన్డే జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. సౌతాఫ్రికా-ఎతో జరిగిన అనాధికారిక వన్డే సిరీస్‌లో రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నవంబర్ 30 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: Bengal squad for SMAT: మహ్మద్ షమీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవరంటే?


