రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ వుమెన్ హెడ్‌కోచ్ మలోలన్ రంగరాజన్ ధ్రువీకరించాడు.
తొలుత భుజం నొప్పి.. ఇపుడు
‘‘బెంగళూరులో ఉన్న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)నుంచి పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) విడుదల కావడానికి మరో రెండు వారాలు పట్టవచ్చు. తొలుత ఆమె భుజం నొప్పితో CoEలో చేరింది.
అయితే, దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేయంతో మరికొన్నాళ్ల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమైంది. కోలుకోవడానికి పదిహేనుల రోజుల దాకా పట్టవచ్చు. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో వేచి చూడాల్సిందే’’ అని మలోలన్ రంగరాజన్ తెలిపాడు.
‘భారీ’ ధరకు కొనుగోలు
కాగా 26 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా చివరగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడింది. అయితే, ఆమెకు ఉన్న అరుదైన నైపుణ్యాల కారణంగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2025 వేలంలో ఆర్సీబీ ఏకంగా రూ. 85 లక్షలు వచ్చించి పూజాను కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్‌తో ఆమె తిరిగి కాంపిటేటివ్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వాల్సింది.
అయితే, తొడ కండరాల గాయం కారణంగా పూజా వస్త్రాకర్ ఆటకు దూరం కాగా.. ఆర్సీబీ రెండు వారాల పాటు ఆమె సేవలు కోల్పోనుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్-2026 ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శన
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. ఈ సీజన్‌లో శుభారంభం అందుకుంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించింది. చివరి బంతికి ఫోర్ బాది ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది.
నవీ ముంబై వేదికగా శుక్రవారం టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజీవన్ సజన 25 బంతుల్లో 45 పరుగులు చేసి ముంబై టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది.
63 పరుగులతో అజేయంగా
ఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆదిలో తడబడింది. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డి క్లెర్క్ 44 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 63 పరుగులతో అజేయంగా నిలిచింది.
ఆమెకు తోడుగా ప్రేమా రావత్ నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు బాది జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించింది. కాగా అంతకు ముందు డి క్లెర్క్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.
చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు


