టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు సిద్దమయ్యాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున ఆడనున్నాడు. ఈ టోర్నీ కోసం బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కింది.
ఈ జట్టు కెప్టెన్‌గా వెటరన్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. షమీతో పాటు టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ కూడా బెంగాల్ జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో వికెట్ కీపర్‌గా అభిషేక్ పోరెల్ స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఈ టోర్నీ గ్రూప్-సిలో ఉన్న బెంగాల్ జట్టు.. నవంబర్ 26న హైదరాబాద్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ గ్రూపులో బెంగాల్‌తో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్, పుదుచ్చేరి, హర్యానా జట్లు ఉన్నాయి.
షమీ రీ ఎంట్రీ ఇస్తాడా?
కాగా మహ్మద్ షమీ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. షమీ భారత్ తరపున చివరగా ఈ ఏడాది మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటి నుంచి అతడు జట్టు బయటే ఉంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి షమీని మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు.
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ మొదటి దశలో పూర్తిస్థాయిలో పాల్గొన్న ఈ వెటరన్ పేసర్.. ఏకంగా 20 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే షమీని జట్టులోకి తీసుకోవడం లేదని చెప్పుకొస్తున్నాడు.
కానీ ఇటీవల షమీ అయితే తన ఫిట్‌గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని పరోక్షంగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఒకవేళ షమీ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్‌తో టీ20లకు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), షకీర్ హబీబ్ గాంధీ , యువరాజ్ కేస్వానీ, ప్రియాంషు శ్రీవాస్తవ్, షాబాజ్ అహ్మద్, ప్రదీప్త ప్రమాణిక్, రిటిక్ ఛటర్జీ, కరణ్ లాల్. సాక్షం చౌదరి, మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్, యుధాజిత్ గుహా, శ్రేయాన్ చక్రవర్తి.
చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాము: స్టోక్స్


