మహ్మద్ షమీ.. వన్డే క్రికెట్‌లో తిరుగులేని ఫాస్ట్ బౌలర్. అమ్రోహా అనే చిన్న గ్రామం నుంచి వచ్చి తన పేస్ బౌలింగ్‌తో వరల్డ్ క్రికెట్‌ను శాసించిన ధీరుడు అతడు. వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలవడం నుంచి ఒక వన్డే మ్యాచ్‌లో 7 వికెట్ల తీయడం వరకు ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ కేవలం 108 వన్డేల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకుని భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా షమీ కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడినప్పటికి.. షమీ బౌలింగ్ ప్రదర్శనను మాత్రం సదరు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు.
కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీసి, ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలోనూ షమీ తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి షమీ ఇప్పుడు జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు.
కెరీర్ ముగిసినట్లేనా?
మహ్మద్ షమీ గతేడాది మార్చి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి అతడిని సెలక్టర్లు మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో సెలక్టర్లపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అతడికి మరోసారి మొండి చేయి చూపించింది. కివీస్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేటప్పుడు సెలక్షన్ కమిటీ షమీ పేరును కనీసం పరిశీలించలేదంట. షమీ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికి.. అంతర్జాతీయ క్రికెట్‌కు కావాల్సిన అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్‌ను అతడు ఇంకా అందుకోలేదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ముఖ్యంగా గాయం తర్వాత అతడి బౌలింగ్‌లో పేస్ తగ్గిందని, కేవలం కేవలం సీమ్ పొజిషన్‌పైనే ఆధారపడుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా వన్డే వరల్డ్‌కప్-2027 సమయానికి అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లను పూర్తి స్ధాయిలో సిద్దం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. 34 ఏళ్ల షమీని జట్టులోకి తీసుకోకపోవడానికి ఇదొక కారణమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అగార్కర్‌పై విమర్శలు..
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్య బృందం తనకు క్లియరెన్స్ ఇచ్చినా జట్టులోకి తీసుకోకపోవడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను షమీ బహిరంగంగానే విమర్శించాడు. డొమాస్టిక్ క్రికెట్ ఆడుతున్నవాడిని అంతర్జాతీయ స్దాయిలో ఆడలేనా అని ప్రశ్నించాడు. అందుకు అగార్కర్ కూడా సమాధానమిచ్చాడు. షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం చెప్పేవాడిని, కేవలం ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడిని తీసుకోవడం లేదని షమీ చెప్పుకొచ్చాడు.
దేశవాళీ క్రికెట్‌లో అదుర్స్..
షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలోన అతడు అదరగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను?


