యాషెస్ సిరీస్ 202-26ను ఇంగ్లండ్ ఘోర ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు అయింది. బౌలింగ్ పరంగా ఇంగ్లీష్ జట్టు ఫర్వాలేదన్పించినప్పటికి.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమైంది.
తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరును కనబరిచింది. బోలాండ్, స్టార్క్, డాగెట్‌లు నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు కూడా తేలిపోయారు.
ట్రావిస్ హెడ్ తుపాన్‌ను ఇంగ్లీష్ బౌలర్లు ఆపలేకపోయారు. హెడ్ కేవలం 83 బంతుల్లోనే 123 పరుగులు చేసి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. స్టార్క్ బౌలింగ్, హెడ్ మెరుపు బ్యాటింగ్ ధాటికి తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందించాడు. హెడ్ తన సంచలన బ్యాటింగ్‌తో మ్యాచ్ తమ నుంచి దూరం చేశాడని స్టోక్స్ తెలిపాడు.
"ట్రావిస్ హెడ్ నిజంగా ఒక అద్భుతం. అతడు బ్యాటింగ్ చూసి మేము షాక్‌కు గురయ్యాము. నాలుగో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సరికి మ్యాచ్ మా నియంత్రణలోనే ఉందని భావించాం. కానీ హెడ్ తన తుపాన్ బ్యాటింగ్ విజయాన్ని మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.
పిచ్‌లో ఎటువంటి మార్పు లేదు. అయితే ఈ వికెట్‌పై క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. డిఫెన్స్ ఆడటం కంటే, సులువైన బంతులను బౌండరీలకు తరలించిన వారికే ఈ వికెట్ మీద పరుగులు వచ్చాయి. మేము బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాము.
మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను ఈ గేమ్‌లో కొనసాగించలేకపోయాము. హెడ్ దూకుడును ఆపేందుకు మేము మూడు, నాలుగు రకాల ప్లాన్‌లు అమలు చేశాం. కానీ అతడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండడంతో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్‌లో అతడు అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు తన రిథమ్‌ను అందుకుంటే ఆపడం చాలా కష్టం.
సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. కానీ తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం మాకు ఉంది. ఇంకా మాకు నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఓటమిని పక్కన పెట్టి బ్రిస్బేన్‌లో జరగబోయే టెస్టు కోసం సిద్ధమవుతాము అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.


