అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లకు ఏటా ఇచ్చే వార్షిక నిధుల మొత్తాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పెంచింది. గతేడాది వరకు ఐఓఏ గుర్తింపు పొందిన సమాఖ్యకు రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇచ్చేది. అయితే ఈ ఏడాది నుంచి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో గ్రాంటు మొత్తాన్ని రెట్టింపు చేసే నిర్ణయం తీసుకున్నారు.
రూ. 7 లక్షల స్థానంలో ఇకపై
అలాగే ఐఓఏ అనుబంధ రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు ఇచ్చే గ్రాంటులను సైతం ఐఓఏ పెంచింది. రూ. 7 లక్షల స్థానంలో ఇకపై రూ. 10 లక్షలను రాష్ట్ర సంఘాలకు ఇచ్చేందుకు ఏజీఎంలో తీర్మానించినట్లు ఐఓఏ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం జరిగిన ఏజీఎంలో భారత్‌లో గత కొన్నేళ్ల క్రీడా ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది.
ఇందులో ఐఓఏ ఆఫీస్ బేరర్లతో పాటు అందుబాటులో ఉన్న పలువురు క్రీడాకారులు, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన ప్రతినిధులు సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు.
అథ్లెట్ల గళం వినిపించేందుకు ఆయా క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో అథ్లెట్లు తప్పనిసరని, అథ్లెట్స్ కమిషన్‌ను కూడా మరింత బలోపేతం చేస్తామని నిర్ణయాధికారాల్లో క్రీడాకారులు భాగస్వాములవుతారని ఐఓఏ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏజీఎం జరిగింది. చివరిసారిగా 2023, మార్చిలో ఐఓఏ సర్వసభ్య సమావేశం జరిగింది.
తాజా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం క్రీడాపాలసీని పారదర్శకంగా అమలు చేయాలని, జవాబుదారితనాన్ని పెంచాలని కూడా తీర్మానించారు. అంతకుముందు 1996 నుంచి 2011 వరకు ఐఓఏ అధ్యక్షుడిగా పనిచేసిన సురేశ్ కల్మాడీ మృతికి సంతాపంగా ఐఏఓ సభ్యులంతా కొన్ని నిమిషాలు మౌనం పాటించారు.
నిర్ణయాత్మక చర్యలు
ఈ సందర్భంగా పలువురు ఐఓఏ చీఫ్‌గా కల్మాడీ చేసిన సేవల్ని కొనియాడారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ ‘క్రీడాభివృద్ధికి సంస్కరణల్ని అమలు చేయాలి. తద్వారా మన అథ్లెట్ల అభ్యున్నతికి మనం నిబద్ధతతో కృషి చేయాలి. ప్రతీ క్రీడాకారుడి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఐఓఏ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నాం. భారతదేశ క్రీడా ప్రగతి కోసమే మేమంతా పాటుపడతాం’ అని అన్నారు.


