
48వ ఏజీఎంలో ముకేశ్ అంబానీ వెల్లడి
50 కోట్లకు కస్టమర్లు: ఆకాశ్ అంబానీ
జామ్‌నగర్ క్లౌడ్ రీజన్‌కు రెడీ: పిచాయ్
రిలయన్స్‌తో జేవీ ఏర్పాటు: జుకెర్‌బర్గ్
రిలయన్స్ రిటైల్ 20% వృద్ధి: ఈషా అంబానీ
కొత్త ప్రాజెక్టులపై రూ. 75 వేల కోట్ల పెట్టుబడి: అనంత్
వచ్చే ఏడాది(2026) ద్వితీయార్ధంలోగా జియో ప్లాట్‌ఫామ్స్‌ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ కంపెనీ 48వ ఏజీఎంలో ప్రకటించారు. ఏఐ సంబంధిత భారీ మౌలికసదుపాయాలతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరున కొత్త జేవీకి తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్‌తో భాగస్వామ్యానికి చేతులు కలిపినట్లు వెల్లడించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఏఐ, ప్రతి చోటా ఏఐ విజన్‌ను ప్రకటించారు.
రిలయన్స్‌తో కలసి జామ్‌నగర్ క్లౌడ్ రీజన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీఎంలో వర్చువల్‌గా పాలుపంచుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ సైతం రిలయన్స్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సంస్థ ఓపెన్ సోర్స్ లామా మోడళ్లను జేవీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. దేశీ సంస్థలకు ఈ జేవీ గేమ్ చేంజర్‌గా నిలవనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. రూ. 855 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మెటాతో జేవీకి తెరతీయనున్నారు. జేవీలో ఆర్‌ఐఎల్‌కు 70 శాతం, మెటాకు 30 శాతం వాటా లభించనుంది.
జియో ప్లాట్‌ఫామ్స్
ఆర్‌ఐఎల్‌కు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఎంతమేర వాటా విక్రయించేదీ ముకేశ్ వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థలో ఆర్‌ఐఎల్‌కు 66.3 శాతం వాటా ఉంది. మెటా(ఫేస్‌బుక్) వాటా 10 శాతంకాగా.. గూగుల్ 7.7 శాతం వాటా కలిగి ఉంది. మిగిలిన 16 శాతం వాటా పీఈ దిగ్గజాల చేతిలో ఉంది. ఐపీవోలో 10 శాతం వాటా ఆఫర్ చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ విలువను 136–154 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ స్థాయిలో విలువ నమోదైతే ప్రపంచంలోనే ఆరో పెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. ఆవిర్భవించిన దశాబ్ద కాలంలో దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిన జియో వినియోగదారుల సంఖ్య 50 కోట్లను దాటినట్లు సంస్థ చీఫ్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు.
→ జియోఫ్రేమ్స్ పేరుతో జియో స్మార్ట్‌గ్లాస్‌లోకి ప్రవేశించింది. చేతులు వినియోగించకుండా కాల్స్, మ్యూజిక్, వీడియో రికార్డింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ తదితరాలను వివిధ భాషలతో నిర్వహించవచ్చు.
→ వాల్ట్ డిస్నీ ఇండియా విలీనంతో ఏర్పాటైన జియోహాట్‌స్టార్ రెండో పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. 34% టీవీ మార్కెట్ వాటా దీని సొంతం.
రిలయన్స్ రిటైల్.. 40,000 కోట్లు
ఆసియాలోకెల్లా అతిపెద్ద ఏకీకృత ఫుడ్ పార్క్‌ల ఏర్పాటుకు రిలయన్స్ రిటైల్ రూ. 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వీటిలో ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, సస్టెయినబుల్ టెక్నాలజీలు వినియోగించనున్నట్లు సంస్థ ఈడీ ఈషా అంబానీ పేర్కొన్నారు. మూడేళ్లలో వార్షికంగా ఆదాయంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ బిజినెస్(ఆర్‌సీపీఎల్)ను 8 రెట్లు పెంచే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఆదా యాన్ని రూ. లక్ష కోట్లకు చేర్చాలని ఆశిస్తోంది.
ఓ2సీ... భారీ విస్తరణ
ఆయిల్ 2 కెమికల్స్ విభాగంలో కొత్త ప్రాజెక్టులపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు ఆర్‌ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. ఏజీఎంలో తొలిసారి ప్రసంగించారు. 2035కల్లా నికర కర్బన రహిత లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. మొబిలిటీ విభాగంలో జియో–బీపీ ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీ చార్జింగ్, బ్యాటరీల స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వేగంగా పెంచుతున్నట్లు అనంత్ తెలియజేశారు.
n న్యూ ఎనర్జీ విభాగం రానున్న 5–7 ఏళ్లలో ఓ2సీ బిజినెస్‌ను అధిగమించనున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 2028 కల్లా రెట్టింపు ఇబిటాను సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. 2026 కల్లా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు వేసింది. 2032 కల్లా 3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యంపై కంపెనీ కన్నేసింది.