
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇటీవలే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియతుడైన అనంత్ అంబానీ తాజాగా జరిగిన ఆర్ఐఎల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అరంగేట్రం చేశారు. తొలి ప్రసంగంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. జామ్‌నగర్ లో నిర్మిస్తున్న ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్ పురోగతిని తెలియజేస్తూ కళ్లు చెదిరే విషయాలను వెల్లడించారు.
టెస్లా ఫ్యాక్టరీకి 4 రెట్లు.. వంద ఈఫిల్ టవర్ల ఉక్కు..
ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణ విస్తీర్ణం పరంగా టెస్లా గిగాఫ్యాక్టరీ కంటే నాలుగు రెట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్ 44 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని అనంత్ అంబానీ తెలిపారు. అంతే కాదు, ఈ కాంప్లెక్స్ 3.4 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 100 ఈఫిల్ టవర్లకు సమానమైన సుమారు 7 లక్షల టన్నుల ఉక్కును నిల్వ చేయగలదని ఆయన ప్రకటించారు.
లక్ష కిలోమీటర్ల కేబుల్..
అనంత్ ప్రకటించిన గిగా ఎనర్జీ కాంప్లెక్స్ లో చంద్రుడి వద్దకు వెళ్లిరావడానికి ఎంత దూరం ఉంటుందో అంత అంటే దాదాపు లక్ష కిలోమీటర్ల కేబుల్ కూడా ఉంటుంన్నారు. అనంత్ అంబానీ ప్రకారం.. గిగా ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణానికి విస్తృతమైన నిర్మాణ ఆటోమేషన్ మద్దతుతో 50,000 మందికి పైగా కార్మికులు రికార్డు వేగంతో పనిచేస్తున్నారు.
కొత్త ప్రాజెక్టులవే..
అనంత్ అంబానీ తన ప్రసంగంలో రూ.75,000 కోట్లకు పైగా విలువైన కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ ప్రాజెక్టులలో నాగోథానేలో 1.2 మెట్రిక్ టన్నుల పీవీసీ ప్లాంట్, దహేజ్‌లో 2 మిలియన్ పీటీఏ సౌకర్యం, పాల్ఘర్‌లో 1 మిలియన్ టన్నుల స్పెషాలిటీ పాలిస్టర్ సౌకర్యం ఉన్నాయి. తమ హజీరా కార్బన్ ఫైబర్ ఫెసిలిటీ ప్రపంచంలోని మూడు అతిపెద్ద, ఏరోసాప్స్, డిఫెన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్‌లో ఒకటిగా ఉంటుందని అనంత్ అంబానీ వెల్లడించారు. అలాగే జామ్ నగర్ లో స్వయంప్రతిపత్తి కలిగిన రిఫైనరీని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.