ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకెక్కారు. తాను టెక్ పరిశ్రమలో కీలకంగా మారిన కృత్రిమ మేధ(AI) రేసులోకి అడుగుపెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ ప్రోమిథియస్’ అనే కొత్త ఏఐ స్టార్టప్‌కు మద్దతు ఇవ్వడంతోపాటు బెజోస్ దాని కో-సీఈఓగా ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేయనున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తర్వాత బెజోస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ హోదాను చేపట్టడం ఇదే తొలిసారి.
భారీ నిధులు
ప్రాజెక్ట్ ప్రోమిథియస్ ఇప్పటికే 6.2 బిలియన్ డాలర్ల భారీ నిధులను సేకరించింది. ఇందులో కొంత భాగం బెజోస్ సమకూర్చారు. ఇప్పటికే ఈ స్టార్టప్ సీఈఓలుగా వెరిలీ, ఫోర్ సైట్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు విక్ బజాజ్‌లున్నారు. ఈ కంపెనీ కంప్యూటర్లు, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్ వంటి కీలక రంగాలలో ఇంజినీరింగ్, తయారీ కోసం ప్రత్యేకమైన ఏఐ ఉత్పత్తులను రూపొందించనుంది. ఈ సంస్థలో ఇప్పటికే మెటా, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్ వంటి కంపెనీల నుంచి వచ్చిన 100 మందికి పైగా ఏఐ పరిశోధకులు పనిచేస్తున్నారు.
Haha no way 😂
Copy 🐈 https://t.co/TG8UMrWwQr— Elon Musk (@elonmusk) November 17, 2025
ఎలాన్ మస్క్ స్పందన
ఈ వార్తలపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. బెజోస్ ఎంట్రీ గురించి తెలుసుకున్న మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో.. ‘హాహా నో వే.. కాపీక్యాట్’ అని తెలిపారు. మస్క్ బెజోస్‌ను కాపీక్యాట్ అని పిలవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు మస్క్ స్పేస్‌ఎక్స్‌కు పోటీగా ఇంటర్నెట్ బీమింగ్ ఉపగ్రహాలను ప్రయోగించే ప్రణాళికలను అమెజాన్ ప్రకటించినప్పుడు ఒకసారి అన్నారు. మరోసారి టెస్లాకు పోటీగా అమెజాన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కంపెనీ జూక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు మస్క్ ఇలాగే స్పందించారు.
ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్..


