రుణాలపై వడ్డీ రాయితీ
ప్రకటించిన కేంద్ర వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్లు రుణాలపై వడ్డీ రాయితీ పథకానికి, రూ.2,114 కోట్లు రుణ హామీల కోసం కేటాయించింది. తద్వారా ఎగుమతిదారులు సులభంగా రుణాలు పొందగలరని పేర్కొంది. 2025 నుంచి 2031 వరకు ఆరేళ్ల కాలానికి ఈ ప్యాకేజీని తీసుకొచి్చంది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న నిధుల సమస్యకు ఈ చర్యలు పరిష్కారం చూపిస్తాయని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ బాడూ పేర్కొన్నారు.
వడ్డీ రాయితీ పథకం కింద ఎగుమతిదారులు.. ఎగుమతులకు ముందు, తర్వాత తీసుకున్న రుణాలపై వడ్డీ రేటులో 2.75 శాతాన్ని సబ్సిడీ కింద పొందొచ్చు. ఏడాదిలో రూ.50 లక్షల వరకు వడ్డీ రాయితీకి ఒక ఎంఎస్‌ఎంఈకి అర్హత ఉంటుంది. ఒక్కో సంస్థకు రూ.10 కోట్ల వరకు రుణ హామీ కూడా ఈ పథకంలో భాగంగా లభిస్తుంది. 2025 నవంబర్‌లో కేంద్రం రూ.25,060 కోట్లతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ను ప్రకటించడం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగానే ఈ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచి్చంది. దీనికి సంబంధించి సవివర మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేయనుంది.


