ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం 24 న నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ, కీలక మాక్రో డేటా విడుదల, గ్లోబల్ ట్రేడ్ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు మార్కెట్ దిశను నిర్ధేశించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ బాదుడు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది.
ఈవారం మార్కెట్లు అప్రమత్తంగా కదులుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సమీప కాలంలో మార్కెట్లు రేంజ్‌బౌండ్ ట్రేడింగ్‌లోనే కొనసాగే అవకాశముందని, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్, మాక్రో డేటా గణాంకాలు మార్కెట్‌కు ప్రధాన ట్రిగ్గర్లుగా ఉండనున్నాయి. ప్రతి గ్లోబల్ న్యూస్, ఎకనామిక్ డేటాకు మార్కెట్ తక్షణ ప్రతిస్పందన చూపే ‘‘ఈవెంట్డ్రివెన్ ట్రేడింగ్ఙ్ జరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీతో పెరిగే ఒడిదుడుకులు
ఫిబ్రవరి నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ కారణంగా మార్కెట్లలో షార్ట్‌టర్మ్ వోలాటిలిటీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ట్రేడర్లు పొజిషన్ రోల్‌ఓవర్స్, షార్ట్ కవరింగ్, ప్రాఫిట్ బుకింగ్ వంటి చర్యలకు దిగుతారు. దీంతో సూచీలు అకస్మాత్తుగా పెరగడం ,ఊహించని విధంగా పతనం కావడం సాధారణం. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, హెవీ వెయిట్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశముంది.
మాక్రో డేటాపై పెట్టుబడిదారుల ఫోకస్
ఈవారం విడుదలయ్యే కీలక ఆర్థిక గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. జీడీపీ గణాంకాలు, విదేశీ మారక నిల్వలు తదితర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు దేశ ఆర్థిక వృద్ధి జోరు, కార్పొరేట్ ఎరి్నంగ్స్ ట్రెండ్‌పై స్పష్టత ఇవ్వనున్నాయి. జీడీపీ గణాంకాలు బలంగా ఉంటే మార్కెట్‌కు సపోర్ట్ లభించే అవకాశం ఉంది, బలహీన గణాంకాలు వస్తే షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ పెరిగే అవకాశముంది.
ట్రంప్ టారిఫ్ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం
అమెరికా తాజా టారిఫ్ నిర్ణయం గ్లోబల్ ట్రేడ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. టారిఫ్‌ల పెంపు ట్రేడ్ టెన్షన్‌ను మళ్లీ పెంచే అవకాశముండటంతో ఎమర్జింగ్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ సరఫరా వ్యవస్థ, ఎగుమతులపై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రూడ్ ఆయిల్, అమెరికాఇరాన్ పరిణామాలు కీలకం
క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు భారత మార్కెట్లకు కీలక సూచికగా మారనున్నాయి. అంతర్జాతీయ జియోపాలిటికల్ టెన్షన్స్, ముఖ్యంగా అమెరికాఇరాన్ సంబంధాల పరిణామాలు ఆయిల్ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆయిల్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగి మార్కెట్లపై నెగటివ్ ప్రభావం పడే అవకాశముంది.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం, గ్లోబల్ లిక్విడిటీపై కన్ను
విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాల ధోరణి మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించే మరో కీలక అంశం. గ్లోబల్ వడ్డీ రేట్ల సంకేతాలు, డాలర్ బలం, రిస్క్ సెంటిమెంట్ ఆధారంగా ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడి వ్యూహాలను మార్చే అవకాశం ఉంది.
గత వారమిలా..
గత వారం(16–20) దేశీ స్టాక్ మార్కెట్లు చాలావరకూ సానుకూలంగానే కదిలాయి. దేశీయంగా ఏఐ సదస్సు, యూఎస్‌తో ట్రేడ్ డీల్‌పై అంచనాలు తదితర అంశాలు ఇన్వెస్టర్లకు తొలుత జోష్‌నిచ్చాయి. అయితే ఏఐ కారణంగా దేశీ టెక్నాలజీ రంగంలో పెనుమార్పులకు తెరలేవనున్న అంచనాలు సాఫ్ట్‌వేర్ సేవల రంగ కౌంటర్లలో భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. ఇది సెంటిమెంటును దెబ్బతీయగా.. గత గురువారం అన్ని రంగాలలోనూ భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. వెరసి గత వారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్వల్ప లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు(0.25 శాతం) బలపడి 82,815 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) జమ చేసుకుని 25,571 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ 0.35 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.3 శాతం నీరసించింది.
టెక్నికల్‌గా చూస్తే.. ఈ వారం
వారాంతాన(27న) దేశ క్యూ3 జీడీపీ, జనవరి మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. క్యూ2(జూలై–సెపె్టంబర్)లో ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇక అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో జీడీపీ 7 శాతం పురోగమించనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేయగా.. ఇతర ఫైనాన్షియల్ సంస్థలు 7.4 శాతం వృద్ధిని ఊహిస్తున్నాయి. కాగా.. ఈ వారం యూఎస్ ప్రభుత్వ టారిఫ్‌లను ఆ దేశ సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ తిరిగి 15 శాతం టారిఫ్‌లను తాజాగా ప్రకటించడంతో అయోమయం నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ వారం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్ కావచ్చని తెలియజేశారు.
→ గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాయిని అధిగమించడంలో తడబడింది. అయితే 25,200–24,800 పాయింట్ల వద్ద ఈ వారం మద్దతు కనిపించే వీలుంది. ఈ స్థాయిల నుంచి బలపడి 26,000 పాయింట్లను దాటితే మరింత జోరు చూపే అవకాశముంది. 26,400 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.
→ బీఎస్‌ఈ సెన్సెక్స్ మొదట 82,200–82,000 పాయింట్ల వద్ద సపోర్ట్ తీసుకునే అవకాశముంది. ఇక్కడి నుంచి పురోగమిస్తే 84,000 పాయింట్ల మైలురాయికి చేరుకోవచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత బలపడేందుకు వీలుంది.
సాక్షి, బిజినెస్ డెస్క్


