గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (GIFT City) భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(IFSC)గా వృద్ధిని నమోదు చేసింది. 2020 నాటికి 82 కంపెనీలున్న గిఫ్ట్ సిటీలో 2025 నాటికి వీటి సంఖ్య ఏకంగా 409 సంస్థలకు చేరింది. ఇందులో 23 బ్యాంకులు, 177 ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థలు, 200కు పైగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఉన్నాయి. ఈ అసాధారణ వృద్ధికి దోహదపడిన ప్రధాన కారణాలు చూద్దాం.
అభివృద్ధికి కారణాలు
గిఫ్ట్ సిటీ ఇంతలా అభివృద్ధి చెందడానికి ప్రధానంగా రెండు అంశాలు కీలకం. ఒకటి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు. రెండు.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన అపారమైన పన్ను మినహాయింపులు కలిసొచ్చిన అంశం. పదేళ్లపాటు ఐఎఫ్‌ఎస్‌సీ యూనిట్లకు 100% ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నారు. విదేశీ కరెన్సీ రుణాలపై వడ్డీకి విత్‌హోల్డింగ్ పన్ను ఉండదు. గిఫ్ట్ సిటీ యూనిట్లకు అందించే లేదా వాటి నుంచి పొందే సేవలకు జీఎస్టీ వర్తించదు.
నిర్దిష్ట లావాదేవీలు, మూలధన లాభాల పన్నుపై కూడా రాయితీలు లభిస్తాయి. గుజరాత్ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని కూడా రద్దు చేసింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కారణంగా గిఫ్ట్ సిటీ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలైన సింగపూర్, దుబాయ్ వంటి వాటి కంటే తక్కువ నిర్వహణ వ్యయాన్ని కలిగి ఉంది. దాంతో ఇది అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తోంది.
నియంత్రణ సులభతరం
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (IFSCA) స్థాపనతో బ్యాంకింగ్, బీమా, మూలధన మార్కెట్లు వంటి అన్ని ఆర్థిక సేవల నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఇది సింగిల్ విండో క్లియరెన్స్‌ల ద్వారా వ్యాపారాన్ని స్థాపించడం, నిర్వహించడం సులభతరం చేస్తుంది.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
వ్యాపార సంస్థలు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలుగా అత్యాధునిక ఆఫీస్ స్పేస్‌లు, నివాస గృహాలు ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(ఒకే చోటు నుంచి అండర్ వాటర్ పైపుల ద్వారా విభిన్న భవనాలకు కూల్ వాటర్ సదుపాయం), భూగర్భ యుటిలిటీ టన్నెల్, ఆటోమేటెడ్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ వంటి అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు సిద్ధం చేశారు. ఇక్కడ నివాస, వాణిజ్య ప్రాంతాలు దగ్గరగా ఉండటం ఉద్యోగుల జీవన నాణ్యతను పెంచుతుంది.
గుజరాత్‌కు ఉన్న ప్రత్యేక అవకాశాలు
సముద్ర తీరం, పోర్ట్ కనెక్టివిటీ
గుజరాత్ పొడవైన తీర రేఖను కలిగి ఉంది. ఇది సుమారు 1600 కిలోమీటర్లు. ఈ భౌగోళిక ప్రయోజనం కారణంగా గుజరాత్‌లో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులు ఉన్నాయి (ముంద్రా, కాండ్లా). ఇది అంతర్జాతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్‌కు గుజరాత్‌ను కేంద్రంగా నిలుపుతుంది. గిఫ్ట్ సిటీలో స్థాపించబడే అంతర్జాతీయ వాణిజ్య ఫైనాన్స్ సంస్థలకు, మెరైన్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ పోర్ట్ కనెక్టివిటీ ఒక సహజమైన వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది.
పరిశ్రమలు
పెట్రోలియం, పెట్రోకెమికల్ రిఫైనరీలు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, డైమండ్స్ వంటి విభాగాల్లో గుజరాత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వైవిధ్యభరితమైన పరిశ్రమలు గిఫ్ట్ సిటీలోని ఆర్థిక సంస్థలకు స్థిరమైన వ్యాపార డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి.
ఇదీ చదవండి: వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ..


