అస్సాం రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అక్కడ తీవ్రవాదులతో పొంచి ఉన్న ముప్పు... అడవుల్లో ఉగ్రవాదుల ఆవాసాలు... బోడోల నుంచి దాడులు.. బంగ్లాదేశీ వలసదారుల సమస్యలు... వారి మధ్య హింస... పోరు... ఇలా పెను సవాళ్లను ఎదుర్కొన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ పని చేసే అధికారుల తీరు ఎలా ఉంటుందనే ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యలతో సతమతమవుతున్న ఆ రాష్ట్రంలో ఓ లేడీ ఐపీఎస్ అధికారి తనదైన శైలిలో వారిని ఎదుర్కొని... దేశం ముందు ఓ రోల్ మోడల్‌గా నిలిచింది.
అస్సాం రాష్ట్రానికే చెందిన ఆ మహిళ ఆ రాష్ట్రంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందింది. తన రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి బాగా గుర్తించిన ఆమె ఆ సమస్యలను నివారించడంలో చూపిన ధైర్య సాహసాలు.... దేశంలో ఎంతో మంది మహిళలకు మార్గదర్శకాలుగా నిలిచాయి. అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించి....ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా.... ఐరన్ లేడీగా... మరో కిరణ్‌బేడీగా పేరొందిన ఐపీఎస్ అధికారి సంజుక్తా పరాశర్.... గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సంజుక్తా పరాశర్.... 1979 అక్టోబరు 3న అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్‌లో జన్మించారు. ఆమె తల్లి మీనాదేవి అస్సాం హెల్త్ సర్వీసెస్ లో పనిచేస్తుండగా.... తండ్రి దులాల్ చంద్ర బారువా నీటిపారుదల శాఖలో ఇంజనీర్ గా పనిచేశారు. గౌహతిలో హోలీ చైల్డ్ ఆర్మీ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తయిన తరువాత....న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీ ఫర్ విమెన్‌లో పొలిటికల్ సైన్స్ ఆనర్స్‌లో డిగ్రీ, జవహర్ లాలా్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఇంటర్నల్ రిలేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జెఎన్‌యూలోనే అమెరికన్ విదేశాంగ విధానంలో ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. 2006లో యూపీఎస్‌సీ పరీక్షలు రాసి ఆలిండియా 85వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ అవకాశమున్నా... ఐపీఎస్‌ను ఎంచుకుని... శిక్షణ పొందిన తర్వాత అస్సాం- మేఘాలయా కేడర్‌కు తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా పోస్టింగ్ సాధించారు. 2008లో అస్సాం, మాకుమ్ జిల్లాలో అసిస్టెంట్ కమాండెంట్‌గా తొలి పోస్టింగ్ తీసుకున్నారు.
పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఉగ్రవాదులపై పోరాటం ప్రారంభించారు. AK-47 తుపాకీ చేత బట్టి నేరుగా అడవుల్లోకి వెళ్లారు. కిందిస్థాయి సిబ్బందిపై పూర్తిగా వదిలేయకుండా ప్రతి దాడిలో నేరుగా పాల్గొని కేవలం 15 నెలల వ్యవధిలో 16 ఎన్‌కౌంటర్లు చేశారు. 64 అరెస్టులు.... భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బోడోస్, బంగ్లాదేశీ వలసదారుల మధ్య హింసను నియంత్రించడాన్ని ఓ సవాలుగా తీసుకుని ఉగ్రవాదులను పరుగులు పెట్టించింది. ఉగ్రవాద మూలాల్ని మట్టబెట్టినప్పటికీ... ఇప్పటికీ అస్సాంలో అసాంఘిక శక్తుల్లో ఆమె పేరు వినగానే వణుకు పుడుతుంది. దీంతో ఐపీఎస్‌లో చేరగానే ఫీల్డ్ ఆపరేషన్లలో నేరుగా పాల్గొన్న అరుదైన మహిళాధికారిగా గుర్తింపు పొందారు. ఆమె ధైర్యం, క్రమశిక్షణ, నిబద్ధతతను గుర్తించిన తోటి అధికారులు... సిబ్బంది ఆమెను 'ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం అని పిలుస్తారు.
ఆమె కెరీర్‌లో విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు నాయకత్వం వహించడం... 15 నెలల్లో 16 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం... పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు అమెరికన్ విదేశాంగ విధానంలో పీహెచ్‌డీ చేసిన ఆమెకు అంతర్జాతీయ సంబంధాలపై ఆమెకు ఉన్న ఆసక్తి... అవగాహనను ప్రతిబింబిస్తుంది. సంజుక్త పరాశర్ కథ ఒక ప్రేరణాత్మక గాథగా... విద్య, ధైర్యం.... కర్తవ్యనిబద్ధతతో ఒక మహిళా అధికారి ఎలా ఉగ్రవాదులపై పోరాడి ప్రజలలో భద్రతా భావన కలిగించగలదో చూపిస్తూ అస్సాంలో కథనాలు ప్రచురితం కాగా... పలు టీవీ ఛానెళ్లలో ఆమె గురించి చర్చలు... విద్యాలయాల్లో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ విద్యా బోధనలు జరిగాయి.
ఆమె ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వాలు ఆమె శౌర్యానికి రాష్ట్రపతి పోలీస్ పతకం... విశిష్ఠ సేవలకు గానూ పోలీసు పతకం... మహిళా సాధికారతకు గాను రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తన సేవలు... ధైర్య సాహసాలతో ఆమె తన తోటి అధికారులు, కింది స్థాయి సిబ్బందికి మార్గదర్శకంగా మారారు. ముఖ్యంగా మహిళలకు మాత్రం ఓ రోల్‌మోడల్‌గా నిలిచారు.
అస్సాం రాష్ట్రానికి చెందిన 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పురు గుప్తాను ఆమె 2008లో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. విధుల నిర్వహణలో భాగంగా భార్యా భర్తలు నెలల వ్యవధి దూరంగా ఉన్నప్పటికీ... వారి కుమారుణ్ని సంజుక్త తల్లి చూసుకుంటుందంటే తన కుటుంబాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రెండు నెలలకు ఓ సారి తల్లితో..., టిన్సుకియాలో డిప్యూటి కమిషనర్‌గా ఉన్న భర్తతో, కుమారుడితో కలిసి కొన్ని రోజులు ఉండి తిరిగి తన విధి నిర్వహణకు అంకితమవడం ఆమె అంకిత భావం, స్ఫూర్తిని చాటుతోంది.
ఆమె తన ఐపిఎస్ కెరీర్లో ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఉగ్రవాద పోరులో ఆమెకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. భర్త, తల్లి, కుమారుడు ఉన్న ఆమెను చంపేస్తామని, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని ఉగ్రవాదులు, బోడోల బెదిరింపులు వచ్చినా డోంట్ కేర్ అంటూ ఎక్కడా జంకకుండా, అధైర్య పడకుండా తన ఆపరేషన్లను సక్సెస్ చేశారు. ప్రస్తుతం సంజుక్తా పరాశర్ న్యూఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డిఐజిగా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రొఫార్మా ప్రమోషన్ ఇవ్వడంతో ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2017 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆమెకు ఈత, జిమ్నాస్టిక్స్ ల అభిరుచులున్నాయి.
-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్


