1500 సంవత్సరాల నాటి ప్రాచీన పద్ధతిలో రూపుదిద్దుకున్న నౌక
పోరుబందర్ నుంచి ఒమన్‌కు బయల్దేరిన నౌక
పోరుబందర్: ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్యచిత్రంలోని అసంపూర్ణ అంశాలను గుదిగుచ్చి, ఎలాంటి యంత్రాలు, మేకులు, స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవనిర్మిత అద్భుతం ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ నౌక తొలి సముద్రయానాన్ని విజయవంతంగా ఆరంభించింది. సోమవారం గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీరనగరానికి పయనమైంది.
వెస్టర్న్ నావల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జెండా ఊపి నౌకాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. ప్రాచీన భారతీయ నావికానిర్మాణ కౌశలాన్ని కళ్లకు కట్టేలా ‘కుట్టుడు పద్ధతి’లో నౌక నిర్మించామని భారత రక్షణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 15 రోజులపాటు 1,400 కిలోమీటర్ల సముద్రయానం చేశాక ఒమన్ తీరానికి నౌక చేరుకోనుంది.
పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక అంటూ ప్రధాని ప్రశంస
నౌక ప్రయాణంపై ప్రధాని మోదీ అమితానందం వ్యక్తంచేశారు. ‘‘ పోరుబందర్ నుంచి మస్కట్‌ను మన ప్రాచీనమూలాలున్న ఐఎన్‌ఎస్ కౌండిన్య బయల్దేరడం ఎంతో సంతోషదాయకం. నౌకలోని 18 మంది నావికుల ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నా. గల్ఫ్, ఆవలి ప్రాంతాలతోనూ భారత్ ప్రాచీనకాలంలో అద్బుతంగా సముద్రమార్గంలో వాణిజ్యం జరిపేదని ఈ నౌక ద్వారా చాటిచెప్పండి. మేకులకు బదులు తాళ్లతో విడిభాగాలను జతచేసే స్టిచ్చింగ్ పద్దతిలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నౌక భారత ఉజ్జ్వలమైన సముద్రసంప్రదాయాలను స్మరణకు తెచ్చింది. నౌకను నిర్మించిన కళాకారులు, సిబ్బందికి నా అభినందనలు. ఈ నౌక పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక’’ అని మోదీ అన్నారు.
సహజసిద్ధంగా.. సమున్నతంగా..
→ నౌక తయారీలో మేకులు ఉపయోగించలేదు.
→ స్టిచ్చింగ్ పద్ధతిలో విడిభాగాలను అత్యంత ధృడమైన తాళ్లతో ముడివేశారు.
→ కొబ్బరినారతో తయారుచేసిన తాళ్లను ఉపయోగించారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు. కేవలం తెరచాపలతో గాలివాటానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది.
→ సహజసిద్ద జిగురులతో విడిభాగాలను అతికించారు. చేప నూనెను పూత పూశారు.
→ ఐదో శతాబ్దంనాటి అజంతా గుహల్లో వెలుగుచూసిన ప్రాచీన నౌక చిత్రాల నుంచి డిజైన్‌ను సంగ్రహించారు.
→ ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది. నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, తెడ్డులను ప్రాచీన తరహా డిజైన్‌లో రూపొందించారు.
→ పురాతన నౌకా నిర్మాణాలు, నౌకా నిర్మాణశాస్త్రం, సాంప్రదాయ విధానాలను మేళవించి నౌకకు తుదిరూపునిచ్చారు.
→ కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నౌకాస్థావరంలో దీనిని తయారుచేశారు. దీని పొడవు 65 అడుగులు.
→ ఒకటో శతాబ్దంలో హిందూమహాసముద్రంలో సముద్రయానం చేసిన భారత నావికుడు కౌండిన్య పేరుతో ఈ నౌకకు ‘ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్‌ఎస్‌వీ) కౌండిన్య అని నామకరణం చేశారు.
→ ఒక తెరచాపపై కదంబ పాలకుల రాజలాంఛనమైన గండభేరుండ పక్షి చిత్రం, మరో తెరచాపపై సూర్యుని ఆకృతిని చిత్రించారు.


