breaking news
Western Naval Command
-
ఐఎన్ఎస్వీ కౌండిన్య చరిత్రాత్మక యాత్ర షురూ
పోరుబందర్: ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్యచిత్రంలోని అసంపూర్ణ అంశాలను గుదిగుచ్చి, ఎలాంటి యంత్రాలు, మేకులు, స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవనిర్మిత అద్భుతం ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ నౌక తొలి సముద్రయానాన్ని విజయవంతంగా ఆరంభించింది. సోమవారం గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీరనగరానికి పయనమైంది. వెస్టర్న్ నావల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జెండా ఊపి నౌకాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. ప్రాచీన భారతీయ నావికానిర్మాణ కౌశలాన్ని కళ్లకు కట్టేలా ‘కుట్టుడు పద్ధతి’లో నౌక నిర్మించామని భారత రక్షణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 15 రోజులపాటు 1,400 కిలోమీటర్ల సముద్రయానం చేశాక ఒమన్ తీరానికి నౌక చేరుకోనుంది. పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక అంటూ ప్రధాని ప్రశంస నౌక ప్రయాణంపై ప్రధాని మోదీ అమితానందం వ్యక్తంచేశారు. ‘‘ పోరుబందర్ నుంచి మస్కట్‌ను మన ప్రాచీనమూలాలున్న ఐఎన్ఎస్ కౌండిన్య బయల్దేరడం ఎంతో సంతోషదాయకం. నౌకలోని 18 మంది నావికుల ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నా. గల్ఫ్, ఆవలి ప్రాంతాలతోనూ భారత్ ప్రాచీనకాలంలో అద్బుతంగా సముద్రమార్గంలో వాణిజ్యం జరిపేదని ఈ నౌక ద్వారా చాటిచెప్పండి. మేకులకు బదులు తాళ్లతో విడిభాగాలను జతచేసే స్టిచ్చింగ్ పద్దతిలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నౌక భారత ఉజ్జ్వలమైన సముద్రసంప్రదాయాలను స్మరణకు తెచ్చింది. నౌకను నిర్మించిన కళాకారులు, సిబ్బందికి నా అభినందనలు. ఈ నౌక పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధంగా.. సమున్నతంగా.. → నౌక తయారీలో మేకులు ఉపయోగించలేదు. → స్టిచ్చింగ్ పద్ధతిలో విడిభాగాలను అత్యంత ధృడమైన తాళ్లతో ముడివేశారు. → కొబ్బరినారతో తయారుచేసిన తాళ్లను ఉపయోగించారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు. కేవలం తెరచాపలతో గాలివాటానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. → సహజసిద్ద జిగురులతో విడిభాగాలను అతికించారు. చేప నూనెను పూత పూశారు. → ఐదో శతాబ్దంనాటి అజంతా గుహల్లో వెలుగుచూసిన ప్రాచీన నౌక చిత్రాల నుంచి డిజైన్‌ను సంగ్రహించారు. → ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది. నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, తెడ్డులను ప్రాచీన తరహా డిజైన్‌లో రూపొందించారు. → పురాతన నౌకా నిర్మాణాలు, నౌకా నిర్మాణశాస్త్రం, సాంప్రదాయ విధానాలను మేళవించి నౌకకు తుదిరూపునిచ్చారు. → కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నౌకాస్థావరంలో దీనిని తయారుచేశారు. దీని పొడవు 65 అడుగులు. → ఒకటో శతాబ్దంలో హిందూమహాసముద్రంలో సముద్రయానం చేసిన భారత నావికుడు కౌండిన్య పేరుతో ఈ నౌకకు ‘ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్ఎస్వీ) కౌండిన్య అని నామకరణం చేశారు. → ఒక తెరచాపపై కదంబ పాలకుల రాజలాంఛనమైన గండభేరుండ పక్షి చిత్రం, మరో తెరచాపపై సూర్యుని ఆకృతిని చిత్రించారు. -
రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకే..
సాక్షి ముంబై: యుద్ధనౌక ‘విక్రాంత్’ భద్రతా బాధ్యతలు చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని, అంతేకాక ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గత 15 సంవత్సరాల్లో సేకరించి ఇవ్వలేకపోయిందని, అందుకే తుక్కు కింద అమ్మాలని నిర్ణయించినట్లు బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరాలిలా ఉన్నాయి... ‘భారత నౌకాదళం 1997 నుంచి విక్రాంత్ సేవలను నిలిపివేసింది. దీంతో ఆ నౌకను తుక్కు కింద విక్రయించడం లేదా మ్యూజియంగా మార్చడం వంటి రెండు ప్రతిపాదనలను రూపొందించింది. 1998లో విక్రాంత్‌ను మ్యూజియంగా మారుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం విక్రాంత్‌ను నిలిపేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, మరమ్మతులు పూర్తికాగానే దాని భద్రత బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం షరతులు విధించింది. ఈ షరతుల్లో ఏ ఒక్కదాన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. దీంతో రోజురోజుకూ ‘విక్రాంత్’ నిర్వహణ వ్యయం పెరిగిపోతూనే ఉంది. గడిచిన 15 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం దాదాపు రూ.22 కోట్లు ఖర్చుచేసింది. కే ంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో రెండు సార్లు ఈ నౌకను ప్రజల సందర్శనార్థం తెరిచింది. ప్రస్తుతం విక్రాంత్ నౌక వయస్సు 70 సంవత్సరాలు. భద్రత దృష్ట్యా ఈ నౌక ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను, ఇతర ప్రత్యామ్నాయ అంశాలను కేంద్రం పరిశీలించింది. అయినప్పటికీ వాటివల్ల ప్రయోజనమేమీ లేదనే అభిప్రాయంతోనే విక్రాంత్‌ను తుక్కు సామాగ్రి కింద అమ్మాలని నిర్ణయం తీసుకున్నామ’ని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఇదిలాఉండగా ఈ నౌకను తుక్కు సామగ్రి కింద అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రకటించింది. ఈ నిర్ణయంపై అనేక రంగాల నుంచి విమర్శలు వచ్చాయి. విక్రాంత్‌ను కాపాడుకునేందుకు ఇటీవల సామాజిక సంస్థలు, విద్యార్థులు విరాళాలు సేకరించారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా.. ఎందుకు తుక్కు కింద అమ్మాలని నిర్ణయించుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేంద్ర కోర్టుకు ఈ అఫిడవిట్ సమర్పించింది.


