అప్నా ప్లాట్‌ఫామ్‌ఫై 14 లక్షల జాబ్ పోస్టింగ్‌లు
వీటికి 9 కోట్ల మంది దరఖాస్తు
40 శాతం మహిళల నుంచే
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఉద్యోగ మార్కెట్ మంచి వృద్ధిని చూసినట్టు అప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. 9 కోట్లకు పైగా ఉద్యోగ దరఖాస్తులు తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైనట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 29 శాతం అధికమని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, ఫ్రెషర్స్ ఎక్కువగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్టు పేర్కొంది. సేవల రంగంలో ఉద్యోగాలు మెట్రో నగరాల నుంచి ద్వితీయ, తృతీయ (టైర్–2, 3) నగరాలకు విస్తరించినట్టు తెలిపింది.
2025లో 14 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఆప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్‌పై పోస్టింగ్‌లు నమో దయ్యాయి. 2024తో పోల్చితే 15% పెరిగాయి.
చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు సంబంధించి 10 లక్షల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. పెద్ద కంపెనీలకు సంబంధించి 4 లక్షల ఉద్యోగాల పోస్టింగ్‌లు నమోదయ్యాయి.
14 లక్షల ఉద్యోగాలకు గాను 9 కోట్ల మంది దరఖాస్తు పెట్టుకున్నారు.
దరఖాస్తు దారుల్లో 3.8 కోట్ల మంది మహిళలే ఉండడం గమనార్హం. అంటే 40 శాతంపైన అభ్యర్థులు మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. 2024తో పోల్చితే మహిళా దరఖాస్తుదారులు 36 శాతం పెరిగాయి.
మహిళ దరఖాస్తుల్లో టైర్ 1 నగరాల నుంచి 2 కోట్లు రాగా, టైర్ 2, 3 నగరాల నుంచి 1.8 కోట్ల దరఖాస్తులు దాఖలయ్యాయి.
మేనేజర్, లీడర్‌షిప్ రోల్స్‌కు మహిళల దరఖాస్తులు 2024తో పోల్చి చూస్తే 35 శాతం పెరిగాయి. 1.1 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, రిటైల్ రంగాల్లో ఉద్యోగాల కోసం మహిళలు ఎక్కువగా పోటీపడ్డారు.
ఫ్రెషర్స్ (ఉద్యోగానికి కొత్త) నుంచి 2.2 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయి. 2024తో పోల్చితే ఫ్రెషర్ల దరఖాస్తులు 10% పెరిగాయి.
టైర్–2, 3 నగరాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.
అడ్మినిస్టేషన్, కస్టమర్ సపోర్ట్, ఫైనాన్స్, డిజిటల్ ఉద్యోగాలకు ఎక్కువ స్పందన వచ్చింది.
ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై 2025లో 73 లక్షల ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్ ఇంటర్వ్యూలు చోటు చేసుకున్నాయి.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఉత్పత్తి అభివృద్ధి, డేటా అనలిస్ట్, అకౌంటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల్లో సన్నద్ధత ఎక్కువగా కనిపించింది.
గూగుల్, టెస్లా, స్విగ్గీ, మైక్రోసాఫ్ట్, జియో, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగార్థులకు ప్రాధాన్య కంపెనీలుగా నిలిచాయి.


