ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరింత సంపన్నుడవుతున్నాడు. కంపెనీ సీఈవోగా ఎలాన్ మస్క్‌కు దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన గరిష్ట వేతన ప్యాకేజీకి టెస్లా వాటాదారులు ఆమోదించారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ప్రకటించబడింది. ఆమోదం అనంతరం వేదికపైకి వెళ్లిన మస్క్ కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’తో కలిసి నృత్యం చేస్తూ ఈ విజయాన్ని జరుపుకున్నారు.
ఈ ఘట్టం టెస్లా (Tesla) భవిష్యత్తు రోబోటిక్స్, కృత్రిమ మేధస్సుతో (AI) ఎంత బలంగా ముడిపడి ఉందో సూచిస్తోంది. మస్క్ ప్రకారం.. ఆప్టిమస్ భవిష్యత్తులో తయారీ, సరఫరాలు, వ్యక్తిగత సహాయక సేవల వరకు విస్తరించగలదు. “ఇతర కంపెనీల వాటాదారుల సమావేశాలు బోరింగ్‌గా ఉంటాయ. కానీ మనవి ఎప్పుడూ ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. దీన్ని చూడండి.. ఇది అద్భుతం!” అంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. టెస్లా ఇప్పుడు “కేవలం కార్ల కంపెనీ కాదు.. రోబోటిక్స్, AI ఆధారిత కొత్త యుగానికి నాంది” అని ప్రకటించారు.
Tesla’s Optimus robots outperformed their fellow robot, Elon in dancing 😂pic.twitter.com/hLBnvZSPuL
— SMX 🇺🇸 (@iam_smx) November 6, 2025
సాటిలేని వేతన ప్యాకేజీ
ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని 1 ట్రిలియన్ డాలర్ల వరకూ వేతన ప్యాకేజీని అందుకునే అవకాశాన్ని టెస్లా వాటాదారులు ఎలాన్ మస్క్‌కు కల్పించారు. వచ్చే 10 సంవత్సరాల్లో మస్క్ 878 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా స్టాక్‌ను సంపాదించే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం కంపెనీ నిర్దిష్ట మైలురాళ్లను చేరుకున్నప్పుడు మాత్రమే అమలులోకి వస్తుంది.
గరిష్ట వేతన ప్యాకేజీ అందుకోవాలంటే మస్క్ సాధించాల్సిన లక్ష్యాలు.. 2 కోట్ల వాహనాలు, 10 లక్షల రోబోటాక్సీలు, 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయాలు సాధించాలి. సుమారు 400 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని కంపెనీకి ఆర్జించిపెట్టాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, టెస్లా ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కనీసం 8.5 ట్రిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్లాలి.
నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ వంటి కొంతమంది ప్రధాన పెట్టుబడిదారులు ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, టెస్లా బోర్డు దీన్ని మస్క్‌ను కంపెనీకి కట్టిపడేయడానికి అవసరమైన ప్రోత్సాహంగా భావించింది. బోర్డు అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రణాళిక టెస్లా వాటాదారులకు కూడా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.


