అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన దాదాపు అందరికీ.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) గురించి తెలిసే ఉంటుంది. ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో దీనిని 2003లో నీతా అంబానీచే స్థాపించారు. ఇందులో చాలామంది సెలబ్రిటీల పిల్లలు చదువుకుంటున్నారు. అయితే ఈ కథనంలో ఇక్కడ ఫీజులు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS).. కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్), CAIE (కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) వంటి అనేక కార్యక్రమాలలో విద్యను అందిస్తుంది. అంతే కాకుండా ICSE (ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), IGCSE (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కోసం కూడా విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఈ స్కూల్ పిల్లలను బాధ్యతాయుతమైన, చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యా నైపుణ్యంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి విలువనిస్తూ.. ప్రోత్సహిస్తోంది.
మొత్తం విద్యార్థులు & ఉపాధ్యాయులు
11, 12 తరగతులకు, ఈ పాఠశాల IB (ఇంటర్నేషనల్ బాకలారియేట్) ద్వారా IB డిప్లొమా ప్రోగ్రామ్‌ను అందించడానికి అధికారం పొందింది. ఇందులో సుమారు 1,087 మంది విద్యార్థులు, 187 మంది ఉపాధ్యాయులు (వీరిలో 27 మంది ప్రవాసులు) ఉన్నారు.
తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్ మరియు అబ్రామ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్ల పిల్లలు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS)లో చదువుకుంటున్నారు. కాబట్టి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కరీనా కపూర్, సైఫ్ అలీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ పిల్లల పెర్ఫార్మెన్స్ చూసేందుకు తరచుగా పాఠశాల నిర్వహించే వార్షిక కార్యక్రమంలో కనిపిస్తారు.
ఫీజుల వివరాలు
2023-2024 విద్యా సంవత్సరానికి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒకరిని కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతికి వరకు చదివించడానికి ఫీజులు రూ. 1,400,000 నుంచి రూ. 2,000,000 ఉంటాయని సమాచారం. పాఠశాల ఫీజులలో పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలు, రవాణా, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజు నిర్మాణం గ్రేడ్ స్థాయి ఆధారంగా మారుతుంది. కిండర్ గార్టెన్ నుంచి 7వ తరగతి వరకు ఫీజులు సంవత్సరానికి రూ. 1.70 లక్షలు లేదా నెలకు సగటున రూ. 14వేలు. 8వ తరగతి నుంచి 10వ తరగతులకు సంవత్సరానికి రూ. 5.9 లక్షలు. 11, 12 తరగతులకు ఏటా రూ. 9.65 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఫీజులు కేవలం అంచనా మాత్రమే.


