ప్రతిపాదనలు సిద్ధం చేసిన చంద్రబాబు సర్కారు
రాష్ట్రంలోని 6,837 కేంద్రాల్లో పిల్లల వివరాల సేకరణ
తొలిదశలో 340 కేంద్రాల విలీనం
ఇప్పుడు మెర్జింగ్.. తర్వాత వర్కర్లు, హెల్పర్లను కుదించే ప్రమాదం
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం (మెర్జింగ్) చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మినీ కేంద్రాలుగా ఉన్న 6,837 సెంటర్లలో కొన్ని ఎంపికచేసి సమీపంలోని కేంద్రాలలో కలిపేస్తారు. దీనివల్ల రికార్డుల్లో అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్య తగ్గకుండా చూపినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఒకదాన్లో మరొకటి కలిపేయడం వల్ల సెంటర్లు తగ్గిపోతాయనేది వాస్తవం. అదే జరిగితే విలీనం అయిన అంగన్‌వాడీ కేంద్రాల్లోని వర్కర్లు, హెల్పర్లను కూడా కుదించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అప్‌గ్రేడ్ చేసి.. విలీనంతో కుదింపు..
రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 6,837 ఇప్పటివరకు మినీ కేంద్రాలు. మెయిన్ కేంద్రాల్లో ఒక వర్కర్, ఒక హెల్పర్ ఉంటే.. మినీ సెంటర్లలో ఒక్కరే ఉంటారు. ఇటీవల కేంద్రప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని మినీ సెంటర్లను మెయిన్ కేంద్రాలుగా స్థాయిపెంచారు. మినీ సెంటర్లలో పనిచేసే ఒక హెల్పర్‌కు పదోతరగతి విద్యార్హత ఉంటే వర్కర్‌గా అవకాశం ఇచ్చి మరో హెల్పర్‌ను నియమించుకోనున్నారు. ఇలా 4,687 మినీ అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న వారికి మెయిన్ వర్కర్‌గా అవకాశం వచ్చి వేతనం పెరగనుంది. మరోవైపు అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తుండటాన్ని అంగన్‌వాడీ యూనియన్ నేతలు తప్పుబడుతున్నారు.
తొలిదశలో 340 కేంద్రాల విలీనం
రాష్ట్రంలో తొలిదశలో విలీనం చేసే అంగన్‌వాడీ కేంద్రాల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 340 కేంద్రాలకుపైగా సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మెర్జింగ్ అయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ప్రతి వెయ్యి మందికి ఒక అంగన్‌వాడీ కేంద్రం ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండువేల నుంచి మూడువేలకుపైగా జనాభాకు ఒక అంగన్‌వాడీ కేంద్రం ఉంది.
అంగన్‌వాడీల్లోనే ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల విలీనం ప్రతిపాదనను విరమించుకుని వాటిని బలోపేతం చేయాలి. రాష్ట్రంలో మూడు నుంచి ఆరేళ్లలోపు బాలలు 13 లక్షల మందికిపైగా ఉన్నారు. వారిలో ఎనిమిది లక్షల మంది అంగన్‌వాడీ కేంద్రాల్లోను, మూడులక్షల మంది ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్నారు. మిగిలిన రెండు లక్షలమంది పిల్లలు అటు అంగన్‌వాడీ కేంద్రాల్లోను, ఇటు ప్రైవేట్ స్కూళ్లలోను నమోదు కాలేదని అంగన్‌వాడీలపై ఒత్తిడి పెంచడం సరికాదు. ప్రైవేట్ స్కూల్‌తో నిమిత్తం లేకుండా ఐదేళ్లలోపు చిన్నారులంతా అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో ఉండాలనే ఉత్తర్వులు ఇవ్వాలి.
ఆ పిల్లలకు తల్లికి వందనం, యూనిఫాం, బెల్ట్, బూట్లు ఇవ్వాలని ఈ నెల 14న బాలల దినోత్సవం రోజు సచివాలయాల్లో వినతిపత్రాలు అందించాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రమే ప్రీ స్కూల్ పెడితే పిల్లల హాజరు పెరిగి అవి బలోపేతం అవుతాయి. వాటిని విలీనం చేయాల్సిన అవసరం ఉండదు.
– కె.సుబ్బరావమ్మ, ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్


