సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో నేటి నుంచి పబ్లిష్ అయ్యే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు.. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మీడియా సంస్థలకు ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారని.. తక్షణమే వాటిని తొలగించాలని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రూ.10 కోట్ల పరిహారానికి దావా వేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు. వాదనల విన్న తర్వాత ఇదివరకే ప్రచురించిన కథనాలపై నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు.. కథనాలపై ఇంటెరిం ఇన్జంక్షన్ ఇవ్వాలన్న వినతిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది.
తిరుమల లడ్డూ ప్రసాద వివాదంలో ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు మీడియా సంస్థలు కల్పిత కథనాలు రాస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అంటూ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.


