తాడేపల్లి : ఏపీలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సీఐడీ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. నాసిరకం భోజనంతో ఎంతమంది పిల్లలని చంపుతారని ప్రశ్నించారు. బిల్‌గేట్స్‌తో కూడా హాస్టల్ విద్యార్థుల భోజనం తినిపించగలవా చంద్రబాబూ? అని నిలదీశారు.
ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సుధాకర్‌బాబు.. ఏపీలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు పెడుతున్న నాసిరకం భోజనంపై ధ్వజమెత్తారు. ‘ మీ పిల్లలాంటి వారు కాదా మా పిల్లలు?, లోకేష్, పవన్ కళ్యాణ్ పిల్లలకు ఇదే భోజనం పెట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. సంక్షేమ హాస్టల్‌లో చదువుకునే పిల్లలకు పురుగులతో కూడిన భోజనం పెట్ఠం ఏంటి?, హాస్టల్స్‌లో ఉండే వారిని వెలివేసినట్టుగా ప్రభుత్వ పనితీరు ఉంది. గొప్పలు చెప్పుకునే చంద్రబాబు బిల్‌గేట్స్‌తో హాస్టల్‌లో భోజనం తినిపించగలరా?, దగ్గర్లో ఉన్న ఏ హాస్టల్‌లో ఐనాసరే ఆకస్మిక తనిఖీకి తీసుకెళ్ళాలి.
మా ప్రభుత్వ హయాంలో రోజుకొక రీతిలో భోజనం పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంటరానితనంతో వ్యవహరిస్తున్నారు. ఏ.కొండూరులో ఎలుకలు కలిచి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. చంద్రబాబుకు పేద విద్యార్థులంటే ఎందుకంత చిన్నచూపు?, ఇది కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించటమే. 900 మంది విద్యార్థులు ఆస్పత్రులు పాలయిన వైనంపై చర్చ కు సిద్దం. విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే లోకేష్ క్రికెట్ చూడటానికి కొలంబో వెళ్లాడా?, ప్రత్యేక విమానాల ఖర్చులో పది శాతం హాస్టల్స్ కి పెట్టినా విద్యార్థులకు మంచి భోజనం దొరికేది. పయ్యావుల కేశవ్ దళిత వ్యతిరేకి.

అందుకే బడ్జెట్‌లోనూ ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనాన్ని చూపించారు. నిధుల కేటాయింపు లేకుండా మాపై వివక్ష చూపించారు. లోకేష్ విమాన ఖర్చులను బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తన పార్టీకి రెండు కోట్లు ఇచ్చారు సరే..మరి విద్యార్థుల కష్టాలు కనపడటం లేదా?, అంబేద్కర్ విగ్రహాన్ని గాలికి వదిలేశారు. అక్కడి మొక్కలకు నీరు పోసే దిక్కు లేదు. జగన్ తెచ్చిన డిజిటల్ బోర్డులు, ఆర్వో ప్లాంట్లు, గోరుముద్ద పథకం ఏమయ్యాయి?, విద్యార్థుల మరణాలు, ఆస్పత్రుల పాలవటంపై సీఐడీ విచారణ చేయాలి. విద్యార్థులకు మేలు చేయని ప్రభుత్వం దిగిపోవాలి’ అని డిమాండ్ చేశారు.


