ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కపటత్వంపై మాత్రమే ఆధారపడి పనిచేస్తోందని పదే పదే రుజువు అవుతోంది. స్వయానా మంత్రులే ఫేక్ వీడియోల ప్రదర్శనకు దిగడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు సైతం చెబుతూండటం అత్యంత బాధాకరం. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు ఇప్పటికీ రౌడీయిజం చేయాలని చూస్తున్నాయని, జగన్ పుట్టిన రోజున జంతుబలి చేస్తారా? పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తారా విమర్శించారు. ఇది కూడా పక్కదోవ వ్యూహంలో భాగమే.
జగన్ జన్మదినోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అతడికి వచ్చిన మద్దతు, జరిగిన సంబరాలను కూటమి పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతే.. కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి బైకులు ర్యాలీలు తీసినా కేసులు పెట్టారు. కేక్ కట్ చేసినా అరెస్టు చేశారు. జాతరలో మాదిరి పొట్టేళ్లను నరికారంటూ పలువురు కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా, వారిని అమానుషంగా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. చివరకు పోలీసు శాఖ ఇవన్నీ ఏవో గొప్ప పనులైనట్లు ప్రచారం చేసుకునే దుస్థితికి చేరింది. దీనికి డిజిపి గుప్త సమర్థన మరీ ఘోరంగా ఉంది.తమ వద్ద వాహనాలులేవని, అందుకే నడిపించామని ఆయన చెప్పారు.
నిజమే! ఎవరు చట్ట ఉల్లంఘన చేసినా తప్పే. కేసులు పెట్టవచ్చు. అలా కాకుండా కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ వారిపైనే కేసులు పెడతామని, టీడీపీ, జనసేనలకు చెందిన వారు ఎలాంటి తప్పులు చేసినా, తీవ్ర వ్యాఖ్యలు చేసినా పట్టించుకోబోమని పోలీసులు బాహాటంగా చెబుతున్నట్లుగా వ్యవహరిస్తే ఎలా? నీతులు చెప్పే చంద్రబాబు ఏమని ఆదేశాలు ఇవ్వాలి? ఎవరు బహిరంగంగా జంతు బలి చేసినా ఒప్పుకోరాదని, వివక్ష లేకుండా కేసులు పెట్టాలి అని. ఆ పని చేయలేదు. కొంతకాలం క్రితం టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల పొటేళ్లలను రోడ్డుపైనే నరికారు.
చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.అంతకన్నా దారుణం ఏమిటంటే ఆయన బావమరిది, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కటౌట్ కు పోటేళ్ల తలల దండ వేశారు. ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్, కొందరు టీడీపీ నేతల సమక్షంలోనే పొటేళ్లను నరికి వేడుక చేస్తుంటే ఇదే పోలీసులు వారికి కాపలాగా ఉన్నారు.అంతే తప్ప వీరెవ్వరిపైన కేసులు పెట్టలేదు. చంద్రబాబు మాటలలోని డొల్లతనం ఈ ఘటనలు తెలియచేయడం లేదా?
నిందితులను పెరేడ్ చేయించకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి డీజీపీకి తెలియదా? లేక నిందితులను శిక్షించే హక్కు నేరుగా ఏమైనా రాజ్యాంగం ఇచ్చిందా? డీజీపీ అలా మాట్లాడితే కింది స్థాయి పోలీసులకు ఏమి సంకేతం ఇస్తున్నట్లు? అన్ని రంగాలలో విఫలమైన నేపథ్యంలో పోలీసులే కూటమి పెద్దలకు దిక్కయ్యారు.అందులో వీర విధేయతతో, రాజును మించిన రాజభక్తితో వ్యవహరించే కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అరాచకంగా నడుపుతున్నారు. ఇంత అనుభవం కలిగిన చంద్రబాబుకు ఈ పరిస్థితి అవమానకరం అని వేరే చెప్పనవసరం లేదు.
పోలీసు అధికారులు చంద్రబాబు మాటకన్నా ఆయన కుమారుడు ,మంత్రి లోకేశ్ ఆదేశాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది చంద్రబాబుకు ఏపాటి ప్రతిష్టో ఆయనే ఆలోచించుకోవాలి. మరికొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎవరో ఒక వ్యక్తి రఫ్ఫా, రఫ్ఫా అంటే తప్పన్నారు.ఒకే! అలాగే అనుకుందాం? మరి లోకేశ్ రడ్‌బుక్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్టా? దాని ప్రకారం పోలీసులను పని చేయించడం సరైనదేనా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాళ్లు విరగగొడతాం, కీళ్లు విరగగొడతాం, చేతులు అరగదీస్తాం అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేందుకు ఏ చట్టం అనుమతి ఇస్తోంది? కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి? వారు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదే.
పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ బెదిరిస్తున్నారే! వినుకొండలో రషీద్ అనే యువకుడిని టీడీపీ వారే నడిరోడ్డుపై నరికి చంపితే దానిని ఏమంటారు. కనీసం ప్రభుత్వం ఆ ఘటనను ఖండించిందా? అంతదాక ఎందుకు ! చంద్రబాబు ఇన్ని సుద్దులు చెబుతున్న సమయంలోనే నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు కత్తులు పట్టుకుని రోడ్డుపై ప్రదర్శన చేశారే. వారిపై కేసులు పెట్టారా? రోడ్డుపై నడిపించి అవమానించారా? ఈ రెడ్‌బుక్ అండ చూసుకుని పోలీసులు పలు చోట్ల సామాన్య ప్రజలపై కూడా రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పల్నాడులో సీఐ బెదిరింపులు భరించలేక ఓ ఆర్యవైశ్య మహిళ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య యత్నం చేసింది. ఇది మహిళలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తున్న తీరా!
పొదిలిలో ఒక వ్యాపారిపై పోలీసులు దాడి చేసి కొట్టడంపై ఆర్యవైశ్య సంఘం వారు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారే. సీపీఎం నాయకుడు అప్పలరాజు పై పిడి చట్టం పెట్టడంపై టీడీపీకి చెందిన కొందరు మేధావులు కూడా ఖండిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గంజాయి వంటివి విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయే! అనంతపురంతో సహా పలు చోట్ల భూ కబ్జాలపై వస్తున్న ఆరోపణల మాటేమిటి? ఇవి కాకుండా అనంతలో గన్ కల్చర్ కూడా పెరుగుతోందని వార్తలు సూచిస్తున్నాయి.
తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి రాజ్యాంగం నడుస్తోందే! ఆయన పోలీసు అధికారులనే అవమానిస్తే నోరు విప్పలేకపోయిన వ్యవస్థ మనది. అమాయకులపై మాత్రం లాఠీ ఝళిపిస్తారా? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? హోం మంత్రి అనిత వాటికి సమర్థన ఇవ్వడమా? నిందితులను నడిరోడ్డుపై నడిపించడం ఏదో గొప్ప విషయంగా ఆమె చెబుతారా? రేప్, హత్యల వంటి సీరియస్ నేరాలకు పాల్పడిన వారెవరికి ఇలా చేయలేదే? తెనాలిలో పోలీసుల ముగ్గురు దళితుల అరికాళ్లపై బహిరంగంగా కొట్టి అరాచకంగా ప్రవర్తించినా చర్య తీసుకోకపోగా, అది తప్పు కాదన్నట్లు మాట్లాడితే ఏపీ ప్రజలను కాపాడేదెవ్వరు? కదిరి వద్ద ఒక గర్భిణిపై వైసీపీ కార్యకర్త ఒకరు కాళ్లతో దాడి చేశారంటూ స్వయంగా హోం మంత్రే ఒక ఫేక్ వీడియోను ప్రదర్శించారట.
ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిని ప్రభుత్వం ఖండించలేకపోయింది. తీరా చూస్తే అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ నాయకుడు చెప్పినా, అతని సోదరి తెలిపినా హోం మంత్రి మాత్రం అదే అసత్యాన్ని వల్లెవేసే యత్నం చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు హింసించి నడిరోడ్డుపై నడిపించారు. ఒక వైపు ఫేక్ వీడియోలు, మరో వైపు ఫేక్ ఆరోపణలు, ఇంకో వైపు కక్షపూరితంగా ఏకపక్షంగా వైసీపీ వారిపై కేసులు,అరెస్టులు..ఇవన్ని ఈ ప్రభుత్వం ఎంత నీచంగా పనిచేస్తుంది తెలియచేస్తుంది తప్పమరొకటి కాదు.ఇలాంటి దుష్టచర్యలను ఉన్మాదం అంటారన్న సంగతి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.వైసిపివారిని ఎంత వేధిస్తే వారు అంతగా రాటు తేలుతున్నారన్న విషయం కూడా ప్రజలకు అర్ధం అవుతోంది.కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాలకు ఎప్పుడో అప్పుడు చెక్ పడకుండా ఉంటుందా!
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


