ఉయ్యాలవాడ: ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో విషం తాగించి చంపడంతో పాటు తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు.. తుడుమలదిన్నెకి చెందిన వేములపాటి సురేంద్ర(35), మహేశ్వరి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. మహేశ్వరి తీవ్ర అనారోగ్యంపాలై ఆ బాధతో గతేడాది ఆగస్టులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భార్య చనిపోయినప్పటి నుంచి తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న సురేంద్ర.. కూలి పనులకు వెళ్తూ, పిల్లలు కావ్యశ్రీ(7), జ్ఞానేశ్వరి(5), సూర్య గగన్(1)తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, బుధవారం రాత్రి తన ముగ్గురు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి తాగించి, చంపాడు.
ఆపై తానూ ఉరేసుకుని తనువు చాలించాడు. గురువారం ఉదయం 8 గంటలైనా ఇంటి తలుపులు తెరవకపోవడంతో సురేంద్ర తల్లి కృష్ణమ్మ అక్కడికి వెళ్లి చూడగా కుమారుడు, మనవరాళ్లు, మనవడు విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు.


