 
													గ్లోబల్ మార్కెట్లో టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) 2018 జూలైలో 50000 డాలర్లతో టెస్లా రోడ్‌స్టర్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుని ఇన్నాళ్లయినా.. ఇప్పటికీ కారు డెలివరీ జరగలేదు, డబ్బు కూడా రీఫండ్ కాలేదు. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసారు.
శామ్ ఆల్ట్‌మాన్.. టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్స్, రీఫండ్ కోసం అభ్యర్థించిన మెయిల్ స్క్రీన్‌షాట్‌లను కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో 2018 జులై 11న కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను చెల్లించిన డబ్బును రీఫండ్ చేయమని కూడా మెయిల్ చేశారు. కానీ అతనికి అడ్రస్ నాట్ ఫౌండ్ అనే రిప్లై వచ్చింది.
''టెస్లా రోడ్‌స్టర్ కారును కొనుగోలు చేయడానికి.. నేను ఉత్సాహంగా ఉన్నాను. కంపెనీ కారును డెలివరీ చేయడంలో జరిగిన ఆలస్యాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ 7.5 సంవత్సరాలు వేచి ఉండటం చాలా కాలంగా అనిపించింది'' అని కూడా శామ్ ఆల్ట్‌మాన్ మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.
రద్దు చేసుకోవడం కష్టం
టెస్లా రోడ్‌స్టర్ కారును బుక్ చేసుకున్న తరువాత.. బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్న వారిలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ మాత్రమే కాకుండా, ప్రముఖ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ కూడా ఉన్నారు. ఈయన 2017లో రెండు టెస్లా రోడ్‌స్టర్‌లను రిజర్వ్ చేసుకున్నట్లు వెల్లడించారు. బుకింగ్ ప్రక్రియ సులభంగా జారిపోయింది. కానీ రిజర్వేషన్‌ను రద్దు చేసుకోవడం ఊహించిన దానికంటే చాలా కష్టమని బ్రౌన్లీ అన్నారు.
టెస్లా రోడ్‌స్టర్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. 2017లో రోడ్‌స్టర్‌ను పర్ఫామెన్స్ బేస్డ్ ఈవీగా ఆవిష్కరించారు. ఇది 1.9 సెకన్లలో 0 నుంచి 96 కి.మీ వేగాన్ని అందుకోగలదని.. గంటలు 402 కి.మీ గరిష్ట వేగంతో 997 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్పోర్ట్స్ కారు ఉత్పత్తిలోకి రాలేదు. 2024లో కూడా రోడ్‌స్టర్ బయటకు రాలేదని మస్క్ పేర్కొన్నారు. కాగా దీనిని ఎప్పుడు అధికారికంగా లాంచ్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.
A tale in three acts: pic.twitter.com/ClRZBgT24g
— Sam Altman (@sama) October 30, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
