
టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా రేసులో ముందున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కాదని మేనేజ్‌మెంట్ సూర్య వైపు మొగ్గు చూపింది. మరోవైపు.. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పేశాడు. దీంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు ఫార్మాట్ సారథిగా పగ్గాలు చేపట్టాడు.
సత్తా చాటుతున్న సూర్య
అయితే, వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఏదేమైనా రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత టీ20లలో సూర్య వరుస విజయాలతో అతడికి సరైన వారసుడు అనిపించుకుంటుండగా.. గిల్ సైతం కెప్టెన్‌గా మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు సాధించాడు.
ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన గిల్
ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్‌గా 754 పరుగులు సాధించి రికార్డులు కొల్లగొట్టిన గిల్.. సారథిగా సిరీస్‌ను 2-2తో సమం చేసి సత్తా చాటాడు. ఇక అంతకంటే ముందు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తద్వారా రెండో ఐసీసీ ట్రోఫీ సాధించి.. మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత.. అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ వన్డే వరల్డ్‌కప్-2027 వరకు సారథిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వన్డేల్లో రోహిత్ వారసుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా అతడే ఉండాలి
రోహిత్ శర్మ తర్వాత భారత వన్డే జట్టుకు కెప్టెన్ అయ్యే అర్హత శ్రేయస్ అయ్యర్‌కే ఉందని అంబటి రాయుడు అన్నాడు. ‘‘అద్భుతమైన నైపుణ్యాలతో గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు.
ఈ ఏడాది.. యువకులతో కూడిన పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడొక అసాధారణ నైపుణ్యాలున్న కెప్టెన్. త్వరలోనే అతడు టీమిండియా కెప్టెన్‌గా నియమితుడు కావాలి’’ అని శుభంకర్ మిశ్రా చానెల్‌లో రాయుడు పేర్కొన్నాడు.
వన్డేలలో సూపర్ హిట్
కాగా టీ20, వన్డే జట్లకు కూడా త్వరలోనే శుబ్‌మన్ గిల్ కెప్టెన్ కానున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో రాయుడు మాత్రం ఈ మేరకు భిన్నంగా స్పందిస్తూ.. శ్రేయస్ అయ్యర్ పేరును ప్రస్తావించడం విశేషం.
ఇదిలా ఉంటే.. భారత వన్డే జట్టులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో రెండు శతకాల సాయంతో 530 పరుగులు చేసిన అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులు సాధించాడు. భారత్ ఈ టైటిల్ గెలవడంలో శ్రేయస్ అయ్యర్‌దే కీలక పాత్ర.
చదవండి: నాన్‌సెన్స్.. అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం