
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ తీరుపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కు కనీస మర్యాద ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డాడు. అనుభవం, నైపుణ్యం ఉన్న లెజెండ్ సలహాలు ఇస్తే.. వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరించాలే తప్ప.. ప్రతి విమర్శలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యాడు.
పాతికేళ్లకు పైగా..
భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన సునిల్ గావస్కర్.. ఆ తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. పాతికేళ్లకు పైగా తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరిస్తూ.. మైదానంలో ఆటగాళ్లు చేసే తప్పులను విశ్లేషిస్తూ విమర్శలు చేస్తూంటాడు ‘లిటిల్ మాస్టర్’. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆట తీరును సందర్భానుసారం విమర్శిస్తూ కామెంట్లు చేశాడు.
కోహ్లి కౌంటర్.. రోహిత్ ఫిర్యాదు!
ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఐపీఎల్‌లో కోహ్లి స్ట్రైక్ రేటును ప్రస్తావించడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మపై గావస్కర్ చేసిన విమర్శలను వాళ్లు తేలికగా తీసుకోలేకపోయారు. తాను స్ట్రైక్‌రేటు గురించి కాకుండా .. జట్టు ప్రయోజనాల కోసమే ఆడతానని కోహ్లి స్పష్టం చేయగా.. గావస్కర్ కామెంట్రీపై రోహిత్ శర్మ ఏకంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.
గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉంది
ఈ పరిణామాల నేపథ్యంలో గావస్కర్ సహచర ఆటగాడు కర్సన్ ఘవ్రీ.. నవతరం ఆటగాళ్ల తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘గత 25 ఏళ్లకు పైగా గావస్కర్ కామెంట్రీ చేస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఆయన మాటలు విలువైన సలహాలు. కానీ.. మన ఆటగాళ్లలో కొందరు మాత్రం సలహాల కోసం గావస్కర్ వద్దకు వెళ్లనే వెళ్లరు.
విదేశీ ఆటగాళ్లు గావస్కర్ సలహాల కోసం వస్తుంటే.. మనోళ్లు మాత్రం ఆయనను పట్టించుకోరు. ఇప్పుడు భారత జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు కచ్చితంగా గావస్కర్ వద్దకు వెళ్లాలి. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉంది.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌ల ఆటను గావస్కర్ విమర్శించాడని వార్తలు వస్తాయే తప్ప.. సలహాల కోసం వాళ్లు ఆయనను సంప్రదించినట్లు ఎక్కడా కనబడదు. ఏదేమైనా గావస్కర్ సలహాలు ఇస్తే దానిని స్వీకరించకపోవడం నాన్‌సెన్స్ అనే చెప్పాలి.
ఎవరైతే ఏంటి? అసలేం అనుకుంటున్నారు?
నువ్వు రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లి అయితే ఏంటి?.. దిగ్గజాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గావస్కర్ ఏం చెప్పినా అది మీ మంచి కోసమే. అంతెందుకు రవిశాస్త్రి కూడా విమర్శలు చేస్తాడు. అయితే, గావస్కర్ తనదైన శైలిలో మంచీ, చెడూ విశ్లేషిస్తాడు’’ అని మాజీ పేసర్ కర్సన్ ఘవ్రీ విక్కీ లల్వాణీ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.
చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్