మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో ఎడిషన్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న జరిగిన లీగ్ ప్రీ షోలో యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌ను సరదాగా స్లెడ్జింగ్ చేసింది. ఈ సన్నివేశం అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇవాల్టి నుంచి (జనవరి 9) డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభం కానుంది. లీగ్ ప్రారంభానికి ముందు నిర్వహకులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లు పాల్గొన్నారు. సరదాగా సాగిన ఈ ఈవెంట్‌లో ట్రూత్ ఆర్ డేర్ అనే ఓ పోటీ జరిగింది.
ఇందులో హోస్ట్ ఇచ్చిన డేర్ ప్రకారం డీసీ కెప్టెన్ లాన్నింగ్, తన మాజీ డీసీ సహచరురాలు, ప్రస్తుత డీసీ కెప్టెన్ జెమీమాను స్లెడ్జ్ చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా లాన్నింగ్ జెమీను ఇలా అంది.
“ఫీల్డర్లు కెప్టెన్ మాట వినకుండా, మైదానంలో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలుస్తుంది” అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. లాన్నింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్యారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ , ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధన లాన్నింగ్ వ్యాఖ్యలకు నవ్వు ఆపుకోలేక టేబుల్‌పై చేతులు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరవలవుతుంది. ఈ వీడియోను చూసి అభిమానులు.. లాన్నింగ్ జెమీ డ్యాన్స్‌లతో విసిగిపోయినట్టుందంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఈ సీజన్‌కు ముందు జెమీ లాన్నింగ్ కెప్టెన్సీలో మూడు సీజన్ల పాటు డీసీకి ఆడింది. ఆ సమయంలో జెమీ లాన్నింగ్ మాటలు వినకుండా డ్యాన్స్‌ల్లో మునిగిపోయేది. ఇదే విషయాన్ని లాన్నింగ్ ట్రూత్ ఆర్ డేర్ ప్రొగ్రాం సందర్భంగా ప్రస్తావించింది.
అందుకు ప్రతీకారం
లాన్నింగ్ మూడు సీజన్ల పాటు డీసీని ఫైనల్స్‌కు చేర్చినా ఇటీవల ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఆమెను వేలానికి వదిలేసింది. వేలంలో లాన్నింగ్‌ను దక్కించుకున్న యూపీ వారియర్జ్ ఆమెను తమ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా చేసింది. లాన్నింగ్‌ను తప్పించిన డీసీ యాజమాన్యం జెమీమాను కెప్టెన్ చేసింది.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెటిజన్లు లాన్నింగ్‌ను సరదాగా ఆట పట్టిస్తున్నారు. తన కెప్టెన్సీని (డీసీ) లాక్కుందని లాన్నింగ్ జెమీపై ప్రతీకారం తీర్చుకుందంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, 2024 ఎడిషన్ విన్నర్స్ ఆర్సీబీ తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.


