
ఆసియా కప్-2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను కొనసాగించాలన్న చిక్కా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను మాత్రం పక్కనపెట్టాలని సూచించాడు. అభిషేక్‌కు జోడీగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపే తాను మొగ్గుచూపుతానని పేర్కొన్నాడు.
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం (ఆగష్టు 19) తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
అందుకే సంజూ వద్దు
ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇటీవల ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు.
ప్రత్యర్థి జట్టు అతడి బలహీనతను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంజూతో ఓపెనింగ్ చేయిస్తే టీమిండియాకు కష్టమే. ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయితే.. ఓపెనర్‌గా అభిషేక్ శర్మకే నా మొదటి ప్రాధాన్యం.
వైభవ్ సూర్యవంశీ ఉండాలి
అతడికి జోడీగా నేనైతే వైభవ్ సూర్యవంశీ లేదంటే సాయి సుదర్శన్‌ను ఎంపిక చేస్తాను. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 ఆడబోయే 15 మంది సభ్యుల భారత జట్టులోనూ నేను వైభవ్ సూర్యవంశీని చేరుస్తాను. అతడు అంత అద్భుతంగా ఆడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.
అదే విధంగా.. ‘‘ఐపీఎల్-2025లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా రాణించాడు. అందుకే.. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌తో పాటు సాయి, జైస్వాల్‌ల పేర్లను కూడా నేను పరిశీలనలోకి తీసుకుంటా.
వికెట్ కీపర్‌గా మాత్రం సంజూకు చోటు
ఇది పోటాపోటీ ప్రపంచం. సంజూ శాంసన్‌కు ఈ జట్టులో ఓపెనర్‌గా అవకాశం దక్కకపోవచ్చు. కానీ వికెట్ కీపర్‌గా సంజూ జట్టులో ఉండే అవకాశం ఉంది. అతడికి బ్యాకప్‌గా జితేశ్ శర్మను తీసుకుంటే బెటర్.
ఇక శ్రేయస్ అయ్యర్ కూడా తప్పక టీ20 జట్టులోకి తిరిగి రావాలి. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ల అవసరం జట్టుకు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
సంజూ ప్రదర్శన ఇలా
కాగా సంజూ శాంసన్ గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో పాటు.. ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు సంజూ. మరోవైపు.. అభిషేక్ శర్మ 279 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకువెళ్లాడు.
ఇక 14 ఏళ్ల బిహారీ ప్లేయర్ వైభవ్ ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాల్స్ తరఫున.. అదే విధంగా.. ఇంగ్లండ్‌లో భారత అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: ‘కోహ్లి కాదు!.. వాళ్లిద్దరికి బౌలింగ్ చేయడం కష్టం.. సచిన్ స్మార్ట్’