
దిగ్గజ బౌలర్లకు సైతం నిద్రలేని రాత్రులు మిగిల్చిన బ్యాటర్లలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)ఒకడు. మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో అతడు దిట్ట. ఇక సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తమకు తామే సాటి
ప్రపంచ క్రికెట్‌లో శతక శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా సచిన్ చిరస్మరణీయ రికార్డు సాధించాడు. అద్భుతమైన నైపుణ్యాలతో బౌలర్లను బోల్తా కొట్టిస్తూ పరుగులు పిండుకోవడంలో అతడికి అతడే సాటి. వీరితో పాటు టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. అలాగే రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి కూడా టీమిండియా నుంచి వచ్చిన గొప్ప ఆటగాళ్లలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
బౌలర్లకు చుక్కలు చూపించగల సత్తా ఉన్న ఈ నలుగురు భారత ప్లేయర్ల గురించి సౌతాఫ్రికా పేసర్ వేన్ పార్నెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్లలో సెహ్వాగ్ ముందుంటాడని పేర్కొన్నాడు.
కోహ్లి కాదు.. సెహ్వాగ్ డేంజరస్ బ్యాటర్
‘‘నాకు తెలిసి ప్రతి ఒక్కరు.. నేను విరాట్ కోహ్లి పేరు చెప్తానని భావించి ఉంటారు. అయితే, నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి వీరేందర్ సెహ్వాగ్ నాకో తలనొప్పిగా మారాడు. ఇక సచిన్ టెండుల్కర్ కూడా నా బౌలింగ్‌లో ఎంతో సులువుగా పరుగులు రాబట్టేవాడు. అతడొక నైపుణ్యాల ఘని.
సచిన్ చాలా స్మార్ట్
సెహ్వాగ్ ఎక్కువగా బౌండరీలు బాదడానికి ఇష్టపడతాడు. అయితే, టెండుల్కర్ మాత్రం ప్రత్యర్థిని తికమకపెడతాడు. తను మొదట ఆడిన షాట్‌కు అనుగుణంగా మనం ఫీల్డింగ్ సెట్ చేసి, బౌలింగ్ వ్యూహం మార్చుకుంటే తాను మరోలా ఆడతాడు. సచిన్ చాలా స్మార్ట్‌గా బ్యాటింగ్ చేస్తాడు.
ధోనికి బౌలింగ్ చేయడం కష్టం
టీమిండియాతో మ్యాచ్ అంటే నాకు నిద్రలేని రాత్రులే మిగిలేవే. ఇక ధోని వంటి ఆటగాడికి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా చాలా కష్టం’’ అంటూ వేన్ పార్నెల్ టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు.
కాగా 36 ఏళ్ల వేన్ పార్నెల్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 15 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 73 వన్డేల్లో 99 వికెట్లు పడగొట్టిన పార్నెల్.. 56 టీ20 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియాతో ఇప్పటికి 23 మ్యాచ్‌లు ఆడిన పార్నెల్ పందొమ్మిది వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరఫున చివరగా 2023లో అతడు.. టీ20 మ్యాచ్ ఆడాడు.