సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. మెడ నొప్పి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న గిల్.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
దీంతో అతడు ప్రోటీస్‌తో వన్డే, టీ 20 సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశముందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా వైస్ కెప్టెన్ కూడా సఫారీలతో వన్డేలకు దూరమయ్యాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత జట్టు పగ్గాలను ఎవరు చేపడతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
కెప్టెన్‌గా రాహుల్..
రిషభ్ పంత్ కెప్టెన్సీ చేపడతాడనే వార్తలు వినిపించినప్పటికీ.. జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సెలక్టర్లు తమ నిర్ణయాన్ని రాహుల్‌కు తెలియజేశారంట. అందుకు రాహుల్ కూడా అంగీకరించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆడనున్నారు. . గతంలో కూడా భారత జట్టు సారథిగా రాహుల్ వ్యవహరించాడు. అంతేకాకుండా ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
పంత్‌తో పోలిస్తే కెప్టెన్‌గా రాహుల్‌కే మెరుగైన రికార్డు ఉంది. అతడి అభనువాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టు వన్డే పగ్గాలను అప్పగించేందుకు సెలక్టర్లు సిద్దమయ్యారు. సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించే ఛాన్స్ ఉంది. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన


