
ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగగా.. టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొత్తగా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
ఈ జట్టులో స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. వికెట్‌కీపర్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ చోటు దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్
గిల్ రీఎంట్రీ.. వైస్ కెప్టెన్‌గా
ఇటీవలే టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్.. టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ వన్డే జట్టుకు కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా ఆడిన గత టీ20 సిరీస్‌కు (ఇంగ్లండ్) దూరంగా ఉన్న గిల్.. ఆసియా కప్‌తో పొట్టి ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
గిల్.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో ఓపెనర్ స్థానం కోసం పోటీపడతాడు. ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారనే విషయాన్ని కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తారని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పాడు.
వారిద్దరిని ఎంపిక చేయలేకపోయాం.. దురదృష్టకరం
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన రెగ్యులర్ జట్టులో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లాంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం దురదృష్టకరమని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే అయినప్పటికీ.. జట్టులో చోటు కల్పించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.
అభిషేక్ శర్మ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తుండటంతో పాటు బౌలింగ్ కూడా చేయగలడన్న కారణం చేత అతనివైపే మొగ్గుచూపినట్లు చెప్పుకొచ్చాడు. జైస్వాల్, శ్రేయస్ జట్టుకు ఎంపిక కాకపోవడంలో వారి వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని, అలాగని ఈ విషయంలో మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు.
కాగా, 8 జట్టు పాల్గొనే ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఖండాంతర టోర్నీ అబుదాబీ, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 10న తమ తొలి మ్యాచ్ (యూఏఈతో) ఆడనుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న సమస్యల కారణంగా ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికంగా మారింది.