
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఈఏ వేదికగా ప్రారంభం కానుంది. 8 జట్లు పాల్గోనే ఈ మెగా టోర్నీకి యూఏఈలోని దుబాయ్, అబుదాబిలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
సూర్యకుమార్ ఫిట్..?
గత నెలలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నాడు. దీంతో ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత జట్టుకు సూర్యనే సారథ్యం వహించనున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టును అద్భుతంగా నడిపించిన టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు సమాచారం. గిల్‌ను భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్‌లో సూర్యకు డిప్యూటీగా గిల్ వ్యవహరించే సూచనలు కన్నిస్తున్నాయి.
అక్షర్‌కు షాక్..?
కాగా ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. రోహిత్ శర్మ టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత సూర్య కెప్టెన్‌గా, అక్షర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఏడాది తిరగక ముందే అక్షర్‌పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైంది. గిల్‌ను ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా చేసేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
గిల్ ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా ఉన్నాడు. ఒకవేళ హిట్‌మ్యాన్ వన్డేల నుంచి తప్పుకొంటే 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా ఈ పంజాబీ బ్యాటర్ భారత జట్టును నడిపించే అవకాశముంది. కాగా గిల్ చివరగా భారత తరపున టీ20ల్లో గతేడాది శ్రీలంకపై ఆడాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం దుమ్ములేపాడు. ఐపీఎల్-2025 సీజన్‌లో 650 పరుగులతో గుజరాత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: మహేశ్ బాబు మరదలితో సచిన్ ప్రేమ?!.. టెండుల్కర్ ఏమన్నాడంటే..