ఆ నటితో సచిన్‌ టెండుల్కర్‌ ప్రేమ?!.. అంజలి కంటే ముందు.. | When Sachin Tendulkar, Shilpa Shirodkar Addressed their Relationship rumours | Sakshi
Sakshi News home page

మహేశ్‌ బాబు మరదలితో సచిన్‌ ప్రేమ?!.. టెండుల్కర్‌ ఏమన్నాడంటే..

Aug 11 2025 1:31 PM | Updated on Aug 11 2025 2:12 PM

When Sachin Tendulkar, Shilpa Shirodkar Addressed their Relationship rumours

క్రికెట్‌- బాలీవుడ్‌ మధ్య విడదీయలేని అనుబంధం ఉందని చెప్పవచ్చు. మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ- షర్మిలా ఠాగోర్‌ నుంచి విరాట్‌ కోహ్లి (Virat Kohli- Anushka Sharma)- అనుష్క శర్మ, కేఎల్‌ రాహుల్‌- అతియా శెట్టి వరకు చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అందుకే ఈ రెండు రంగాలకు చెందిన ఆడ- మగ కలిసి కనిపించారంటే ‘రిలేషన్‌షిప్‌’ గురించి వదంతులు పుట్టుకురావడం సహజమే. అయితే, క్రికెట్‌ దేవుడుగా పేరొందిన సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendukar) గురించి 90వ దశకంలో ఇలాంటి ఓ రూమర్‌ వచ్చింది. నటి శిల్పా శిరోద్కర్‌తో కలిపి సచిన్‌ పేరు వినిపించింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారని ఆ వదంతుల సారాంశం.

శిల్పా శిరోద్కర్‌తో అఫైర్‌?
అయితే, ఇందుకు సచిన్‌ టెండుల్కర్‌- శిల్పా శిరోద్కర్‌ స్పందించిన తీరు మాత్రం భిన్నంగా ఉండటం గమనార్హం. గతంలో సచిన్‌ టెండుల్కర్‌ ఇండియా టుడేతో మాట్లాడుతుండగా ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకూ- శిల్పా శిరోద్కర్‌తో అఫైర్‌?అన్నింటికంటే అత్యంత చెత్త రూమర్‌ ఇది.

ఎందుకంటే మేమిద్దరం అసలు ఒకరికి ఒకరం పరిచయమే లేదు’’ అని కొట్టిపారేశాడు. మరోవైపు.. శిల్పా శిరోద్కర్‌ మాత్రం.. ‘‘నేను హమ్‌ సినిమా చేస్తున్న సమయంలో.. అంటే 1991లో తొలిసారి సచిన్‌ను కలిశాను. మా కజిన్‌ బాంద్రా ఈస్ట్‌కు ఆడేవాడు.

ఒక్కసారి సచిన్‌ను కలిశాను
అదే జట్టు తరఫున సచిన్‌ కూడా ఆడేవాడు. అలా తన ద్వారా సచిన్‌ కలిసే అవకాశం వచ్చింది. అప్పటికే సచిన్‌ అంజలితో ప్రేమలో ఉన్నాడు. అయితే, అప్పటికి ఇంకా ఈ విషయం గురించి బయటకు రాలేదు.

మేమే స్నేహితులం కాబట్టి మాకు ముందే ఈ విషయం తెలుసు. ఏదేమైనా ఓ నటి- క్రికెటర్‌ను కలిసింది అంటే.. అది కూడా సచిన్‌ టెండుల్కర్‌ను కలిసింది అంటే ఇలాంటి వార్తలు పుట్టుకురావడం సహజమే కదా!.. ఏదేమైనా ఒక్కసారి సచిన్‌ను నేను నేరుగా కలిశానని మాత్రం ఒప్పుకొంటా’’ అని పేర్కొంది.

అంజలితో పెళ్లి
కాగా తన కంటే ఐదేళ్లు పెద్దదైన డాక్టర్‌ అంజలిని ప్రేమించిన సచిన్‌ టెండుల్కర్‌ 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె సారా, కుమారుడు అర్జున్‌ సంతానం. ముప్పై ఏళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న అంజలి- సచిన్‌ దంపతులు ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తూ ఉంటారు. 

మరోవైపు.. శిల్పా శిరోద్కర్‌ 2000 సంవత్సరంలో యూకేకు చెందిన బ్యాంకర్‌ అపరేశ్‌ రంజిత్‌ను పెళ్లి చేసుకుంది. కాగా శిల్పా మరెవరో కాదు... సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌కు సొంత చెల్లెలు. అంటే.. మహేశ్‌ బాబుకు మరదలు అన్నమాట.

సిరాజ్‌కు రాఖీ కట్టిన జనాయ్‌
ఇదిలా ఉంటే.. ఇటీవల మహ్మద్‌ సిరాజ్‌- జనాయ్‌ భోస్లే గురించి కూడా ఇలా రిలేషన్‌షిప్‌ వార్తలు వచ్చాయి. అయితే, రాఖీ పూర్ణిమ రోజు జనాయ్‌ సిరాజ్‌కు రాఖీ కట్టి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ గాసిప్‌రాయుళ్లకు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. కాగా జనాయ్‌.. దిగ్గజ గాయని ఆశా భోస్లే మనుమరాలు.

చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్‌ కోహ్లి ఫొటో వైరల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement