
PC: Instagram
విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టించిన ఈ దిగ్గజ బ్యాటర్.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. టీమిండియా లెజెండ్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు (82) బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ప్రపంచ రికార్డు
ఇక వన్డేల్లో సచిన్‌కూ సాధ్యం కాని విధంగా.. 51 శతకాలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే, గతేడాది అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకొన్న ఈ రన్‌మెషీన్.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఊహించని విధంగా
సంప్రదాయ క్రికెట్‌లో టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన విరాట్ కోహ్లి.. తనలో ఇంకా ఆడగలిగే సత్తా ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. ‘‘గడ్డానికి కొన్ని రోజుల క్రితమే రంగు వేసుకున్నాను.
తరచూ ఇలా గడ్డానికి రంగే వేయాల్సి వస్తుందంటేనే.. మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అర్థం’’ అంటూ లండన్‌లో యువీ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన కోహ్లి సరదాగా వ్యాఖ్యానించాడు. తాజాగా కోహ్లి న్యూ లుక్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా!
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త షాష్ విరాట్ కోహ్లితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశాడు. ఇందులో కోహ్లి గడ్డం, మీసం తెల్లబడి ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇది చూసిన కింగ్ అభిమానులు.. ‘‘నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా! నువ్వు పెద్దవాడివై పోతున్నామంటే మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఎల్లప్పుడూ యాంగ్రీ యంగ్‌మేన్ లుక్‌లోనే ఉండాలి’’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు.
వన్డేలకు కూడా రిటైర్మెంట్?
మరికొందరేమో టెస్టులోకి తిరిగి రావాలని కోరుతుండగా.. ఇంకొందరు మాత్రం వన్డేలకు కూడా కోహ్లి త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి వైదొలిగిన 36 ఏళ్ల కోహ్లి.. వన్డేల్లో, ఐపీఎల్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
తిరుగులేని ఛేజింగ్ కింగ్
కాగా విరాట్ కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 9230, 4188 పరుగులు సాధించాడు.
ఇక వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన కోహ్లి ఇప్పటికి 302 మ్యాచ్‌లు ఆడి 14181 పరుగులు చేశాడు. చివరగా ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆడాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు పరుగుల తేడాతో గెలిచింది.
తద్వారా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న కోహ్లి, ఆర్సీబీ పదిహేడేళ్ల కల నెరవేరింది. ఇక కోహ్లి తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి లండన్‌లోనే ఎక్కువగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
చదవండి: సంజూ శాంసన్‌కు మీకిస్తే బదులుగా ఇద్దరిని ఇవ్వండి.. రాయల్స్ డిమాండ్..!